అగ్రకులాల్లో పేదల సమస్యలపై ఓసీ సంక్షేమ సంఘం జూలై 29,30వ తేదీల్లో డిల్లీలో జాతీయ సదస్సుని నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. అవేమీ అమలు కావడంలేదు. అమలు అయినా కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే తప్ప చట్టబద్ధంగా కాదు. ఓసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకపోతే రాష్ట్రాల వారీగా ఉద్యమించే కార్యాచరణను రెండురోజుల సదస్సు చర్చిస్తుందని సంఘం అధ్యక్షుడు జి కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు.
కాపులు, పటేళ్ళు, గుజ్జర్లలో మాత్రమే కాదు. ఇంకా అనేక అగ్రవర్ణాలలో కూడా పేదలు వున్నారు మరి వారి రిజర్వేషన్ల మాటేమిటి అని ప్రశ్నించారు!
వివిధ రాష్ట్రాల్లో, వివిధ పేర్లతో ఉన్న ఓసీ సంఘాలు, రిజర్వేషన్ పోరాట సంఘాలన్నీ ఒకేతాటిపైకొచ్చి రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రకులాలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నది సంఘం డిమాండు.
రిజర్వేషన్లకోసం రాజస్ధాన్, హర్యానా రాష్ట్రాల్లో గుజ్జర్లు, గుజరాత్ లో పటేళ్లు, ఆంధ్రప్రదేశ్ లో కాపుల ఆందోళన హింసకు దారితీసిన విషయం తెలిసిందే. పటేళ్ల నాయకుడు హార్దిక్ పటేల్ ఇటీవలే జైలు నుంచి విడుదలవగా, ఏపిలో కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం, ఆసుపత్రిలోనే ఆమరణ నిరాహారదీక్ష కొనసాగించారు. గుజ్జర్లయితే రైళ్ల వ్యవస్థను నిలిపివేశారు.
ఇలా వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న ఓసీల ప్రత్యేక పరిస్థితులను జాతీయ స్థాయిలో చర్చించడం ద్వారా, దేశం దృష్టిని ఆకర్షించి, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక సంకేతం పంపాలని ఓసీ సంక్షేమ సంఘం నిర్ణయించింది.
ఏపిలో కూడా ఓసీ కార్పొరేషన్ పెడతామని బాబు మహానాడులో ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా ఏర్పాటు చేయలేదు. బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్ పెట్టడం వల్ల ఆయా కులాల వారికి ప్రయోజనం జరగడం మంచిదే. కానీ ఓసీ కార్పొరేషన్‌తోపాటు రిజర్వేషన్లు రిజర్వేషన్లూ అవసరమేనని సంఘం డిమాండు చేస్తోంది.
ఓసీలకు రిజర్వేషన్లు ప్రకటించడం వల్ల ఉపయోగం లేకుండా పోతోందని, న్యాయపరమైన కారణాలతో అవి కోర్టులో వీగిపోతున్నందున, రాజ్యాంగసవరణ అవసరాన్ని సదస్సు వివరిస్తూందని కరుణాకర్‌రెడ్డి వివరించారు.