కులాల రాజకీయంతోనే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉంటుందని రాహుల్ గాంధీ ఫీలవుతున్నారు. కులగణనే దానికి ఆయుధం అని డిసైడ్ అయిపోయారు. కులగణనపై హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఆయన దేశానికి కులగణన తప్ప మరో సమస్య లేదన్నట్లుగా మాట్లాడారు. దేశంలో పేదరికం ఉండటానికి.. అందరికీ అవకాశాలు రాకపోవడానికి ఏ కులం వారు ఎంత మంది ఉన్నారో తెలియకపోవడమేనని రాహుల్ చెప్పుకొచ్చారు. అందుకే కులగణన చేసి.. రిజర్వేషన్ల పరిమితి ఎత్తేసి అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని ఆయన అంటున్నారు.
రాహుల్ వ్యాఖ్యలు వినేవారికి కాస్త వింతగా ఉంటాయి. ఆయన వ్యాపార రంగం గురించి కూడాచెబుతున్నారు. అన్ని రంగాల్లోనూ వివక్ష ఉందని అన్ని రంగాల్లో అందరికీ అవకాశాలు కల్పిస్తామని అంటున్నారు. దేశాన్ని ఇప్పటికీ అత్యధిక కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే కాలనీ కుల వ్యవస్థను నిర్మూలించలేకపోయారు. ఇప్పుడు అదే కులం కార్డుతో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.
కులగణన పేరుతో దేశాన్ని విభజిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. దీనికి రాహుల్ విచిత్రమైన పోలిక తెచ్చారు. టైటానిక్ షిప్ కూలిపోవడానికి పది శాతం ఐస్ బెర్గ్ కనిపించి 90 శాతం కనిపించకపోవడమే కారణం అని.. భారత్ ది కూడా అదే పరిస్థితి అని.. కులగణన చేస్తే వంద శాతం కనిపిస్తుందని అంటున్నారు. భారత్ కూడా టైటానిక్ లాంటిదని కులగణన ద్వారా ఐస్ బెర్గ్ ను కరిగించేద్దామని అంటున్నారు. రాహుల్ లాజిక్ ఏమవుతుందో కానీ.. ఈ కులగణన చేసినా … రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేయడం మాత్రం మళ్లీ కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుంది. అది సాధ్యమేనా ?