రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాల్లో మూడు జిల్లాల జడ్పీ చైర్మన్లు జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. మొత్తం పదమూడు జిల్లాల్లో నాలుగింటికి మాత్రమే.. మహిళా రిజర్వేషన్ కూడా లేకుండా.. నేరుగా జనరల్ అయ్యె చాన్స్ ఉంది. ఆ నాలుగింటిలో మూడు చిత్తూరు, కడప, కర్నూలు కాగా.. నాలుగోది.. మంత్రి బొత్స సత్యనాాయణ బాధ్యత తీసుకోవాల్సిన విజయనగరం జిల్లా. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కూడా జనరలే కానీ.. మహిళలకు రిజర్వ్ అయింది. బీసీలకు తీవ్రంగా అన్యాయం జరిగిన విషయం తాజా రిజర్వేషన్లలో బయట పడింది. పశ్చిమగోదావరి జిల్లా బీసీలకు రిజర్వ్ అయింది. అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలు బీసీ మహిళలకు రిజర్వ్ చేశారు. మొత్తంగా జనరల్ కు ఏడు జిల్లాలు దక్కగా… బీసీలకు మూడు మాత్రమే దక్కాయి. తూర్పుగోదావరి , గుంటూరు ఎస్సీలకు రిజర్వ్ చేశారు.
ఒకటి మహిళకు కేటాయించారు. ఎస్టీ రిజర్వేషన్ విశాఖ జిల్లాకు కేటాయించారు అదీ కూడా మహిళకు. రిజర్వేషన్లన్నీ.. అధికార పార్టీ నేతలు.. తమకు అనుకూలంగా ఉండేలా చూసుకున్నారనన విమర్శలను టీడీపీ నేతలు చేస్తున్నారు. జడ్పీ చైర్మన్ల విషయంలోనే కాదు.. జడ్పీటీసీ, ఎంపీటీసీల వి,యంలోనూ టీడీపీ నేతలు అదే ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం.. ఇలాటి విమర్శలు పట్టించుకోవడం లేదు. తాను అనుకున్నట్లుగా పని చేసుకుంటూ వెళ్తోంది. ఏ క్షణమైనా ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. శనివారం.. ఈ మేరకు ప్రకటన వస్తుందని చెబుతున్నారు. మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 29న జరిగే అవకాశం ఉంది.
తొలి విడత నామినేషన్లు మార్చి 9 నుంచి ఉంటాయి. మార్చి 12 నుంచి 14 వరకు జడ్పీ తొలి విడత నామినేషన్ల స్వీకరణ ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు లీక్ చేశాయి. రెండో విడత నామినేషన్లు మార్చి 12 నుంచి 17 వరకు ఉంటాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు మార్చి 15 నుంచి ఉండనున్నాయి. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఉంటుంది. ఏదైనా నెలాఖరులోపు పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.