గుజరాత్ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం హార్దిక్ పటేల్ నేతృత్వంలో ఉద్యమిస్తున్న పటేల్ కులస్థుల ఉద్యమం విజయవంతం అయ్యింది. గుజరాత్ ప్రభుత్వం ఆ కులస్తులకు విద్యా, ఉద్యోగాలలో మే 1వ తేదీ నుంచి 10 శాతం రిజర్వేషన్లు కేటాయించేందుకు అంగీకరించింది. అయితే వారిలో ఆర్ధికంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. దీనిపై గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ రూపాని, జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో సుదీర్గంగా చర్చలు జరిపిన తరువాత పటేల్ కులస్తులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. ఒకవేళ పటేల్ కులస్తులలో ఉన్నత ఆదాయవర్గాలకు కూడా రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాండ్ చేసినా అందుకు తలొగ్గకూడదని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది గుజరాత్ శాసనసభ ఎన్నికలు ఉన్నందున ఈ ఉద్యమానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టక తప్పదని, లేకుంటే ఎన్నికలలో ఆ ప్రభావం భాజపాపై తప్పక పడే అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే ఇందుకు సిద్దమయినట్లు తెలుస్తోంది. ఈ ఉద్యమం మొదలయిన తరువాత గత ఏడాది జరిగిన పంచాయితీ ఎన్నికలలో 31 పంచాయితీలలో 21 కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడంతో భాజపా అప్రమత్తమయ్యింది. బహుశః అదే భయంతో దానిని ఈ నిర్ణయం తీసుకొనేలా చేసి ఉండవచ్చు. గుజరాత్ లో పటేల్ కులస్థుల జనాభా 12-15 శాతానికి మించక పోయినా విద్యా, వైద్య, వ్యాపార, రాజకీయ రంగాలలో వారిదే పైచెయ్యిగా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలను వారే శాశిస్తున్నారు. కనుక వారితో చెలగాటం ఆడితే అసలుకే మోసం అవుతుందనే భయంతోనే గుజరాత్ ప్రభుత్వం వారి డిమాండ్లకు తలొగ్గి విద్యా, ఉద్యోగ రంగాలలో 10 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించవలసి వచ్చింది. వారి ఈ విజయం ఆంధ్రప్రదేశ్ లో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపులకు ప్రేరణ కల్పించినా ఆశ్చర్యం లేదు.