ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల ప్రజలకు … పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. వేసిన అతి పెద్ద అడుగుగా దీన్ని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం… అంత తేలిక కాదు. ఇప్పటికైతే కేబినెట్ లో ఆమోదించారు. వెంటనే పార్లమెంట్ లో కూడా ప్రవేశపెట్టనున్నారు. అయితే.. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే.. రాజ్యాంగ సవరణ చేయాల్సింది. రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదనే నిబంధన ఉంది. అందుకే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ చేయాలని నిర్ణయించింది. ఈ బిల్లును మంగళవారమే పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. బిల్లు ఆమోదం కోసం సమావేశాలను రెండు రోజులపాటు పొడిగించాలని కూడా నిర్ణయించారు.
ఏడాదికి 8 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగిన వారు ఈ రిజర్వేషన్ల కోటాకు అర్హులు. అయిదు ఎకరాల లోపు మాత్రమే వ్యవసాయ భూమి ఉండాలి. వెయ్యి చదరపు అడుగులకు మించి సొంత ఇల్లు ఉండకూడదు. ప్రభుత్వ విద్యా, ఉద్యోగాల్లోనూ పది శాతం కోటా వర్తించనుంది. ఎన్నికల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న విశ్లేషణలు వస్తూండటంతో.. ఈ రిజర్వేషన్ వ్యవహారాన్ని మోదీ వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చినట్లుతెలుస్తోంది. యూపీలో బీఎస్పీ-ఎస్పీ పొత్తు కుదుర్చుకున్న పరిణామాల తర్వాత బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. బీసీ, మైనారిటీ రిజర్వేషన్ల కోటా పెంచాలని ఇప్పటికే తెలంగాణవంటి రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. కాపు రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టాలని.. ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తోంది.
అయితే రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఇవ్వడం అసాధ్యమని అటు మోదీ, ఇటు అమిత్ షా పదేపదే చెబుతూ వస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ఇప్పుడు ఈబీసీ కోటాను కేంద్రం తెరమీదకు తెచ్చింది. తద్వారా మిగిలిన రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపి రాజకీయ లబ్ధి పొందాలనే వ్యూహంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ రిజర్వేషన్లకు అందరూ ఆమోదం తెలిపితే ఆ ఘనత తన ఖాతాలో పడుతుందన్నది బీజేపీ వ్యూహం..అయితే.. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందన్నది.. ఆసక్తికరంగా మారింది.