తిరుపతిలో నిన్న జరిగిన మహానాడు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ “సమాజంలో ఎస్సి, ఎస్టి, బిసీ తదితర వర్గాల ప్రజల సంక్షేమం కోసం రిజర్వేషన్లు కల్పించి ఆదుకొంటున్నట్లే, అగ్రవర్ణాలలో పేదలను కూడా రిజర్వేషన్లు కల్పించాలని భావిస్తున్నాము. వారి ఆర్ధిక స్థితిగతుల గురించి పూర్తి వివరాలు సేకరించడానికి ఒక సర్వే నిర్వహిస్తున్నాము. ఆ నివేదిక వచ్చిన తరువాత దాని ఆధారంగా అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పించడంపై ఒక నిర్ణయం తీసుకొంటాము. ఇప్పటికే బ్రాహ్మణుల సంక్షేమమ కోసం బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు చేశాము. దాని ద్వారా వారిలో అర్హులకి తగిన సహాయ సహకారాలు అందిస్తున్నాము,” అని చెప్పారు.
సమాజంలో అన్ని అగ్రవర్ణాలలో కూడా చాలా మంది నిరుపేదలున్న మాట వాస్తవం. వారు అగ్రవర్ణాలకి చెందినవారనే ఏకైక కారణంగా వారు తీవ్ర నిరాదారణకు గురవుతున్నారు. అదే కారణంతో ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలను పొందలేకపోతున్నారు. కనుక వారికి కూడా రిజర్వేషన్లు కల్పించడం మంచి ఆలోచనే. కానీ కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి రెండేళ్ళయినా దానిని నెరవేర్చకపోవడం వలన ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాలు, వారికి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదని మరో వర్గం వారు చేస్తున్న గొడవలు అన్నీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ హామీ నెరవేర్చలేక అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు, మళ్ళీ అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు మరో హామీ ఇవ్వడం కోరుండి కొత్త సమస్యలను ఆహ్వానించుకోవడమే అవుతుంది. ఒకవేళ ఇచ్చే ఉద్దేశ్యం ఉన్నట్లయితే, ఈవిధంగా గొప్పలకు పోయి ప్రకటనలు చేయకుండా, సర్వే నివేదిక ఆధారంగా వారికి రిజర్వేషన్లు కేటాయిస్తూ నేరుగా జి.ఓ.జారీ చేయడం మంచిది. లేదా అగ్రవర్ణాల కోసం ఏర్పాటు చేసిన కార్పోరేషన్ ద్వారా వారిలో పేదలకి అన్ని విధాలా అవసరమైన సహాయ సహకారాలు అందించినా వాళ్ళు సంతోషిస్తారు. ఎవరూ అభ్యంతరాలు చెప్పరు. హామీ నిలుపుకోవాలనే ఒత్తిడి, నిలుపుకోలేకపోతే మళ్ళీ దాని వలన అప్రదిష్ట ఉండదు కదా?