ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి యుగపురుషుని పేరు తొలగించడంపై వైసీపీలోని కొంత మంది తమ రాజకీయం తాము చేసి పదవులు పొందుతున్నారు. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రెండు పదవులకు రాజీనామా చేస్తున్నానంటూ హడావుడి చేసిన యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ అనే పెద్ద మనిషి.. తన బ్లాక్ మెయిల్ ప్రకటనల ద్వారా అనుకున్నది సాధించారు. ఏయూలో గౌరవ ప్రొఫెసర్గా పదవి పొందారు. ఈ మేరకు.. వీసీగా కన్నా వైసీపీ నేతగా ఎక్కువగా వ్యవహరించే… ప్రసాదరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన తనంతటకు తాను ఆదేశాలు జారీ చేయరు. పై నుంచి సందేశం వస్తేనే ఇస్తారు.
ఇప్పటికే అధికార భాషా సంఘానికి చైర్మన్గా యార్లగడ్డ ఉన్నారు. కానీ రాజీనామా చేశానని ప్రకటించారు. ఆయన రాజీనామాలు ఆమోదం పొందాయో లేదో తెలియదు. కానీ అదంతా ఉత్త డ్రామా అని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో ఆయన మరోసారి ప్రెస్ మీట్ పెట్టి.. రాజీనామాలు వెనక్కి తీసుకోలేదు.. చాలెంజ్ అన్నారు. కానీ జగన్ ను మాత్రం వైసీపీ నేతల కన్నా ఎక్కువగా పొగిడారు. దీంతో ఆయన చేస్తున్నదంతా రాజకీయం అని.. ఎన్టీఆర్ అంశాన్ని మరోసారి తన పదవుల కోసం వాడుకున్నారని స్పష్టమైంది.
యార్లగడ్డ అనే పెద్ద మనిషి.. టీడీపీ హయాంలో దశల వారీగా పేదల కోసం ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకుంటే… విశాఖలో తెలుగును చంపేస్తున్నారంటూ చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేశారు. అదే జగన్ వచ్చాక… అసలు తెలుగు మీడియం లేకుండా చేసినా గొప్ప నిర్ణయం అని ప్రశసించారు. ఇలాంటి వ్యక్తులు ఉండబట్టే ప్రజా సమస్యలు పెరుగుతున్నాయి … నేతల ఆస్తులు , పదవులు పెరుగుతున్నాయని ఎవరికైనా అనిపిస్తుంది. స్వార్థం కోసం ప్రజా ప్రయోజనాలతో ఆడుకోవడం.. పదవులు పొందడానికి ఏ మాత్రం సిగ్గుపడని నేతలున్నంత కాలం రాజకీయ విలువలు పెరగవని యార్లగడ్డ లాంటి వారి చూస్తే అర్థమవుతోందని టీడీపీ నేతలు చేసే విమర్శల్లో తప్పుందని అనుకోలేం.