ఏపీలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. వాలంటీర్ల విధులపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. వారికి ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్లు, ఫోన్లను ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇక నేరుగా వైసీపీ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. నిజానికి చాలా చోట్ల వారు రాజీనామాలు చేసేందుకు ఇష్టపడటం లేదు కానీ వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు.
వాలంటీర్లు ఉద్యోగులు కారు. వారు గౌరవ వేతనానికి పనిచేస్తున్నారు. ఈ కారణంగా సర్వీస్ రూల్స్ వర్తించవు. అయితే ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నందున రాజకీయ పార్టీలకు నేరుగా పని చేయలేరు. రాజీనామాలు చేస్తే ఎవరికైనా పని చేసుకోవచ్చ. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను.. మళ్లీ వాలంటీర్లుగా నియమించుకునే అవకాశంం ఉంది. కానీ ప్రభుత్వం మారితే రాజీనామా చే్సిన వారిని మళ్లీ తీసుకునే అవకాశం ఉండదు. పైగా గతంలో చేసిన పనుల లెక్కల్లో తప్పులు చూసి కేసులు పెడతారు.
రాజీనామాలు చేయకుండా.. వైసీపీకి పని చేయకుండా ఉన్న వాలంటర్లను మాత్రం కొనసాగిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వరుసగా హామీ ఇస్తూ వస్తున్నారు. వాలంటీర్లకు యాభైవేల వరకూ ఆదాయం వచ్చేలా చూస్తానని చెబుతున్నారు. ఈ క్రమంలో కొంత మంది వాలంటీర్లు తటస్థంగా ఉంటున్నారు. వారికి మాత్రం మెరుగైన భవిష్యత్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాజీనామా చేసిన వారు మాత్రం రెంటికి చెడ్డ రేవడి అయ్యే అవకాశాలు ఉన్నాయి.