హాత్ సే హాత్ జోడో యాత్ర పేరుతో తెలంగాణలో రేవంత్ రెడ్డి చేపడుతున్న పాదయాత్ర.. ఆ యాత్రకు వస్తున్న స్పందన … తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చకు కారణం అవుతోంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు.. మీడియా సపోర్ట్ లేకపోవడం…. ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర తేలిపోతుందని అనుకున్నారు. కానీ ప్రారంభించిన నాటి నుండి రోజు రోజుకు జోరు పెంచుకుంటూ పోతున్నారు. పెద్ద ఎత్తున జనం తరలి వస్తూండటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా … ప్రతిపక్షాలకు చాలా రిజర్వేషన్లతో కొంత కవరేజీ ఇస్తుంది .
రేవంత్ కు కూడా అంతే. ఆయన పాదయాత్ర సాగుతున్న తీరుపై ఎవరూ కవరేజీ ఇవ్వడం లేదు. ఏదైనా ప్రకటన చేసినప్పుడు ఇచ్చామని చెప్పుకోవడానికన్నట్లుగా ఇస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవల్లో మాత్రం రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు సంబరపడుతున్నారు. రేవంత్ రెడ్డికి ఇంత ప్రజాదరణ ఉందని తాము అంచనా వేయలేకపోయామని సీనియర్లు కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రేవంత్ పాదయాత్రను అడ్డుకోవడానికి చేయాల్సినదంతా చేసిన సీనియర్లు ఇప్పుడు పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి సైలెంట్ అయ్యారు.
తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తే డబ్బు ఖర్చు పెట్టుకుని కార్యకర్తల్ని రప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే… మెల్లగా అంతా రేవంత్ రెడ్డికి ట్యూన్ అవుతున్నారు. మొదటరెండు నెలల పాటు పాదయాత్ర షెడ్యూల్ ను ఖరారు చేసుకున్న రేవంత్ … రాష్ట్రమంతటిని కవర్ చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్ కు నమ్మకం కలిగించే నేత అవసరం పడింది. ఇప్పుడు… రేవంత్ రెడ్డి పాదయాత్ర ద్వారా ఆ నమ్మకం కలిగిస్తున్నారని అనుకోవచ్చు.