తెలుగు నాట ‘అర్జున్ రెడ్డి’ ఓ సంచలనం.. ఓ ప్రభంజనం. మేకింగ్ విషయంలో, క్యారెక్టరైజేషన్ల విషయంలో అర్జున్ రెడ్డి ఓ మైలు రాయిగా మిగిలిపోయింది. ఈ చిత్రాన్ని తమిళం, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళ అర్జున్ రెడ్డిగా విక్రమ్ తనయుడు ధృవ్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘వర్మ’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఆ టీజర్ ఇప్పుడు విడుదలైంది. స్వతహాగానే `అర్జున్ రెడ్డి` రీమేక్‌పై తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లింది కాబట్టి.. తెలుగువాళ్లూ దీనిపై ఓలుక్ వేశారు. విజయ్ దేవరకొండ పాత్రలో ధృవ ఎలా సరిపోతాడా? ఈ సినిమాని ఎలా తీశారా? అంటూ ఆసక్తి కనబరిచారు. టీజర్ చూశాక… చాలా మంది మొహాలు తేలిపోయి ఉంటాయి. ఎందుకంటే… ‘అర్జున్ రెడ్డి’లో ఉన్న ఇంపాక్ట్ ‘వర్మ’లో ఏ కొశాన కనిపించలేదు.
టీజర్లో ధృవ్ ఇచ్చిన కొన్ని సీరియెస్ ఎక్స్ప్రెషన్స్ సైతం కామెడీగా అనిపిస్తున్నాయి. దాంతో ‘వర్మ’ సినిమాపై ట్రోలింగ్ మొదలెట్టారు కొంతమంది. అర్జున్ రెడ్డికి ఇది కామెడీ వెర్షన్ అంటూ ఆట పట్టించేస్తున్నారు. ధృవకి గెడ్డం గెటప్ ఏమాత్రం సూటవ్వలేదనిపిస్తోంది. టీజర్ షాట్లు చూస్తే.. మక్కీకి మక్కీ అర్జున్ రెడ్డిని దింపేసినట్టే అనిపిస్తోంది. కాకపోతే అంత ఇంపాక్ట్ అయితే లేదు. టీజర్ కాబట్టి.. చూడాల్సిన సినిమా ఇంకా ఉంది కాబట్టి.. అప్పుడే వర్మపై కామెంట్ ని పాస్ చేయలేం. కాకపోతే.. `అర్జున్ రెడ్డి` లా భారీ అంచనాలు పెట్టుకుని చూడ్డం మాత్రం మంచిది కాదన్న మెసేజ్‌ని పాస్ చేసింది `వర్మ` టీజర్.