జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైరస్ బాధితుల కోసం ట్విట్టర్ ద్వారానే ప్రయత్నిస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఆయన పలువురి గురించి ట్వీట్లు చేశారు. దానిపై క్విక్ రియాక్షన్ వస్తోంది. ఆయన తమిళనాడు సర్కార్ కు ట్వీట్ చేస్తే.. తక్షణం అక్కడ సీఎం స్పందిస్తున్నారు.. కేంద్రానికి ట్వీట్ చేస్తే.. కేంద్రమంత్రి స్పందిస్తున్నారు. కానీ ఏపీ సర్కార్‌కు చేసే ట్వీట్లను ఎవరూ పట్టించుకోవడం లేదు.. అది వేరే విషయం. తాజాగా ఆయన లండన్ హిత్రూ ఎయిర్‌పోర్టులో ఇరుక్కుపోయిన తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం.. పవన్ కల్యాణ్ కేంద్రానికి.. కేంద్ర విదేశాంగశాఖకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. వెంటనే.. ఆ శాఖకు చెందిన సహాయమంత్రి మురళీధరన్ పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేశారు. పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ విషయంలో తాము వెంటనే స్పందించామని.. అక్కడ ఉన్న విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ విషయం మీడియాలో హైలెట్ అయింది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజలు భావిస్తారనుకున్నారేమో కానీ.. మంత్రి సురేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎయిర్‌పోర్టులో ఉన్న విద్యార్థుల కోసం తాము కేంద్రవిదేశాంగ మంత్రితో మాట్లాడమని.. ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రత్యేక శ్రద్ధతో వారి సంక్షేమం గురించి వాకబు చేస్తున్నారని చెప్పారు. అయితే.. ఇందులో ఎక్కడా పవన్ కల్యాణ్ ట్వీట్ గురించి.. ఆయన ట్వీట్ పై స్పందించిన కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి గురించి లేదు. మూడు రోజుల కిందట తమిళనాడు తీరంలో ఇరుక్కుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారుల కోసం.. పవన్ కల్యాణ్ నేరుగా.. తమిళనాడు సీఎం కు ట్వీట్ చేశారు. ఆయన వెంటనే స్పందించి.. వారికి నిత్యావసర వస్తువులు అందించే ఏర్పాటు చేశారు. పవన్ కల్యాణ్ స్పందనపై.. గవర్నర్ తమిళిశై కూడా.. అభినందనలు తెలిపారు.
అయితే.. పవన్ కల్యాణ్ ఎన్ని ట్వీట్లు చేసినా.. ఏపీ సర్కార్ స్పందించడం లేదు. తెలుగు వారి సమస్యల కోసం.. పవన్ కేంద్రానికి, తమిళనాడు సర్కార్ కు మాత్రమే కాదు.. ఏపీ ప్రభుత్వానికి కూడా ట్వీట్ల ద్వారా సమస్యలను విన్నవించారు. కానీ వాటిని కనీసం పట్టించుకున్న వారు లేరు. అక్వా రైతులు, ఉద్యానరైతులు, వలస కూలీల సమస్యలపై పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్లను.. సర్కార్ అసలు పట్టించుకోలేదు. వారి సమస్యను పరిష్కరించలేదు. వారు ఇప్పటికీ తంటాలు పడుతూనే ఉన్నారు.