ముద్రగడ పద్మనాభం పురుగుమందుతో తలుపులు బిగించుకున్నారు గనక అరెస్టు చేశామనడాన్ని అర్థం చేసుకోవచ్చు. కాని రాజమండ్రిలో ఆయనను వుంచిన ఆస్పత్రిని అభేద్య దుర్గంగా మార్చేసి మీడియాను, రాజకీయ నేతలనూ సామాన్య ప్రజలను సహితం అతిగా ఆంక్షలకు గురిచేయడం అవాంఛనీయం. ఆస్పత్రిదగ్గర మామూలు రోగులు సందర్భకులు కూడా నానా అగచాట్టు పడవలసి వస్తున్నది దీనివల్ల సందేహాలు పెరుగుతున్నాయి. కొన్ని ఆందోళనకరమైన విడియో క్లిప్లింగులు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. కాపుల మద్దతు పోగొట్టుకోకుండా చూడాలన్న చంద్రబాబు ప్రభుత్వం మొదట్లో ఆచితూచి వ్యవహరించినా ఈ దఫా మాత్రం అత్యంత కఠినంగా ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్టు గతంలోనే 360లో చెప్పుకున్నాం. ఈ క్రమంలో ప్రజాస్వామ్య పద్ధతులను కూడా గౌరవించాలే తప్ప ఏకపక్షంగా అనుకున్నట్టు చేసుకుపోవడం అశాంతిని పెంచుతుంది. ముద్రగడ వార్తలు అదేపనిగా చూపిస్తున్నారనే నెపం మీదనే సాక్షి ఛానల్ప్రసారలు నిలిపివేశారు. ఎన్టివికి సంబంధించి కూడా కొన్నిచోట్ల రావడం లేదంటున్నారు. ఆ ఛానల్ రిపోర్టర్ ఒకరి పేరు పదేపదే ప్రస్తావిస్తున్నారు. . ప్రభుత్వం ఇప్పటికైనా , సానుకూలంగా వ్యవహరించి ఆయన దీక్ష విరమింపచేయడం తక్షణం జరగాల్సిన పని.అరెస్టులకు సంబంధించి కూడా వివరాలు వెల్లడిస్తే నిజానిజాలు తెలుస్తాయి. ముద్రగడకు గతంలో ఇచ్చిన హామీల అమలు, అవరోదాలు వంటి అంశాలపై వివరాలు వెల్లడిస్తే ప్రజలు ఒక అంచనాకు రాగలుగుతారు. అంతేగాని ఈ దశలో ఆయనపై వ్యక్తిగత దాడులవల్ల ప్రయోజనం లేదు.
ఈ సందర్భంలో చిరంజీవి,దాసరి, పళ్లంరాజు, బొత్స, అంబటి రాంబాబు,రామచంద్రయ్య తదితరులందరూ ఒక్కతాటిమీదకు రావడం ఇటీవలి కాలంలో చూడని పరిణామం. అంటే ఇటు వైపున కూడా కుల సమీకరణ తీవ్రంగానే వుంది. గ్లామర్ ముద్రను కూడా వదలి తన సామాజిక బృందం తరపున ముందుకు వచ్చేందుకు మెగాస్టార్ సిద్ధమైపోవడం విశేషం. కాంగ్రెస్ వైసీపీ నేతలు ఒకచోట కనిపించడం కూడా. .ఇది ముందు ముందు రాజకీయ సామాజిక సమీకరణాలను ప్రభావితం చేసే అంశం.ఇప్పటివరకూ మాట్లాడని పవన్ కళ్యాన్ రేపు ఏ వైఖరి తీసుకుంటారు, చంద్రబాబు తరపున మాట్లాడుతున్న ఆ వర్గం నేతలు మంత్రులు రేపు ఎలా వ్యవహరిస్తారు ఇవన్నీ ముందుముందు చూడాలి. ఈ సమయంలో చాలామంది రంగా హత్యను ప్రస్తావించారు. ఏది ఏమైనా ఆ రోజులు తిరిగిరాకుండా అటు ప్రభుత్వం ఇటు ఆందోళన కారులు కూడా అన్ని విధాల కృషి చేయాలి. ప్రభుత్వం తాను ఇచ్చిన హామీని అమలుచేయడం, ఆందోళన కారులు కూడా పట్టువిడుపులతో వ్యవహరించడం ముందు జరగాలి. రాజకీయ అజెండాలతో సామాజిక వైరాలతో పరిస్థితిని దిగజారనివ్వడం సరికాదు. అన్నిటికన్నా ముఖ్యం ముడ్రగడను కాపాడ్డం. తర్వాత ప్రశాంతతను పునరుద్ధరించడం. .