లోక్ సభ ఎ్నికల పోలింగ్ ముగిసింది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుందామనుకుంటున్న రేవంత్ కు ఈసీ ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. కనీసం కేబినెట్ సమావేశాన్ని కూడా స్వేచ్చగా ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించలేదు. కేబినెట్ భేటీకి అంగీకారం తెలిపినా.. ఆ కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలపై ఆంక్షలు విధించింది.
ఓటింగ్ అయిపోయింది కాబట్టి ఓటర్లను ప్రభావితం చేసే ప్రశ్న రాదు కానీ.. కోడ్ మాత్రం అమల్లో ఉంది. అంతే కాదు మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి సీఎం ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయారు. అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. అన్ని రకాల ధాన్యానికి రూ.500 బోనస్ , రూ.2లక్షల రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళికతో పాటు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవాలనుకున్నారు. రుణమాఫీ వంటి వాటిపై చర్చించవద్దని ఈసీ స్పష్టం చేసింది.
ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులెవ్వరూ మంత్రివర్గ సమావేశంలో పాల్గొనకూడదని షరతు విధించింది. అంటే అత్యంత కీలకమైన అధికారులు ఎవరూ అందుబాటులో ఉండరు. ఒకటో తేదీన విభజన చట్టంలో ఉన్న కొన్ని అంశాలకు ముగింపు లభిస్తుంది. వీటిపైనా కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు వాటిపై కూడా చర్చించకూడదని ఈసీ స్పష్టం చేసింది. అందుకే.. ఎన్నికలకోడ్ ముగిసే వరకూ రేవంత్‌కు చేయడానికి కూడా ఏమీ ఉండదు.