లాక్డౌన్ ఎత్తివేతకు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కానీ సాధారణ జన జీవితం మాత్రం.. తిరిగి రాదు. ఎక్కడికి వెళ్లాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రజలు ఆంక్షల జీవితానికి సిద్దం కావాల్సి ఉంటుంది. మార్చి 21వ తేదీ వరకూ… భారతీయుల జీవితాలు ఉరుకులు, పరుగుల మీద నడుస్తూ ఉండేవి. పెళ్లిళ్లు, సినిమాహాళ్లు. మాల్స్.. ఇలా.. ఎక్కడ చూసినా జనం గుంపులు, గుంపులుగా కనిపించేవారు. మార్చి 22 రోజున జనతా కర్ఫ్యూతో పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు మళ్లీ మార్చి 21వ తేదీ ముందు పరిస్థితులు అంత తేలిగ్గా రావు.
స్కూళ్లు ఉండవు.. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉండదు.. సినిమాహాళ్లు ఉండవు.. మాల్స్ ఉండవు.. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అసలే ఉండదు. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే… స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి. లాక్ డౌన్ ఉన్నప్పుడే ఎవరూ… రూల్స్ లెక్క చేయని పరిస్థితి. అందుకే.. కరోనా కేసులు పూర్తిగా తగ్గి..భరోసా వచ్చిన తర్వాత మాత్రమే.. దేశంలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఎత్తివేత సాధ్యమవుతుందని నిపుణుల అంచనా. కేంద్రం అభిప్రాయం కూడా దాదాపుగా అదే. అందుకే.. లాక్ డౌన్ అనేది నిరంతర ప్రక్రియ అని… కాకపోతే.. ఉపాధి దెబ్బతినకుండా.. రోజువారీ సాధారణ జీవితం గడిపేలా లాక్డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీ ఉంటుందన్న అభిప్రాయం మాత్రం.. మెల్లగా కేంద్రం ప్రజల్లోకి పంపుతోంది..
అలా అని లాక్ డౌన్ పేరుతో.. అన్నింటికీ తాళాలు వేసుకుని కూర్చుంటే.. ఆకలి చావులు ప్రారంభమవుతాయి. అందుకే కేంద్రం వరుసగా.. మినహాయింపులు ఇస్తూ పోతోంది. నెల రోజులయిన సందర్భంగా వ్యవసాయ, అనుబంధ పరిశ్రమలకు.. గ్రీన్ జోన్లలో వ్యాపార వ్యవహారాలను పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత ఇతర దుకాణాలను తెరిచేందుకు చాన్స్ ఇచ్చింది. అయితే అన్నీ గ్రీన్ జోన్ల పరిధిలో మాత్రమే అమలవుతాయి.. మే మూడో తేదీ తర్వాత ప్రజలకు కొంత రిలీఫ్ దొరకవచ్చు. కానీ పూర్తి స్థాయిలో కాదు. అడుగడుగునా ఆంక్షల జీవితం గడపాల్సి ఉంటుంది.