నిత్యావసర వస్తువుల దుకాణాలు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు. అదే మద్యం దుకాణాల టైమింగ్స్.. ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఆరు వరకు. రాత్రి ఏడు నుంచి ఉదయం ఏడు గంటల వరకు కర్ఫ్యూ. ఇది .. విజయనగరం జిల్లాలో పెట్టిన ఆంక్షలు. మంత్రి బొత్స సత్యనారాయణ.. ఇలా డిసైడ్ చేశారు. గ్రీన్ జోన్లలో అన్ని సాధారణ కార్యకలాపాలు క్యాబ్‌లు కూడా తిప్పుకోవచ్చని కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అవే పాటిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ఒక్క గ్రీన్ జోన్ జిల్లా విజయనగరం. దీంతో అన్ని కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అనుకున్నారు. వ్యాపారులు అందరూ హుషారుగా ఉదయమే దుకాణాలు ఓపెన్ చేశారు.
కానీ ఏం జరిగిందో కానీ కాసేపటికే పోలీసులు వచ్చి మూయించారు. అందర్నీ ఇళ్లలోకి తరిమేశారు. మేటరేంటంటే.. మంత్రిగారు మధ్యాహ్నం వచ్చి రివ్యూ చేసి.. ఎలాంటి సడలింపులు ఇవ్వాలో నిర్ణయిస్తారని అధికారులు తెలిపారు. అన్నట్లుగా బొత్స వచ్చి రివ్యూ సమావేశం పెట్టి.. కొన్న సడలింపులు అనుగ్రహించారు. దాని ప్రకారం.. గ్రీన్ జోన్‌కి రావాల్సిన మినహాయింపులన్నీ ప్రజలకు రాలేదు. మద్యం దుకాణాలకు మాత్రమే.. పూర్తి స్థాయి టైమింంగ్స్ అమలు చేయాలని నిర్ణయించారు. మిగతా దుకాణాలకు మాత్రం మధ్యాహ్న ఒంటిగంట వరకే పర్మిషన్ ఉంటుంది. ఇతర నిబంధనలు కూడా అమలవుతాయి. విజయనగంర గ్రీన్ జోన్ జిల్లాగా ఉందని.. దాన్ని కాపాడుకోవడానికి ఇలా ఆంక్షలు అమలు చేయక తప్పడం లేదని ఆయన వాదిస్తున్నారు.
విజయనగరం జిల్లాలో ఒక్క కేసు నమోదు కాలేదు… రెడ్ జోన్ల నుంచి ఇతరుల్ని జిల్లాలోకి అనుమతించే అవకాశం లేదు. ఇప్పటికే 40 రోజుల లాక్ డౌన్ పిరియడ్ ముగిసింది.అయినప్పటికీ .. బొత్స మాత్రం ఆంక్షలు విధించేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు మించి ఆయన సొంత ఆంక్షలు విధించారు. మద్యం దుకాణాలకు మాత్రం.. ఫుల్ టైమ్ కేటాయించడం ఇందులో విశేషం. మరి అక్కడ క్యూలో నిలబడితే గ్రీన్ జోన్ జిల్లా అనే హోదాకు రక్షణ లేకుండా పోతుందేమో.. ఆలోచించలేకపోయారు.