తెలంగాణలో మద్యం దుకాణాలకు అన్లాక్ చేసేశారు. ఇక నుంచి సాధారణంగానే మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఇక నుంచి మద్యం దుకాణాలు ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అన్లాక్ -3 నిబంధనలు ప్రకటించారు. స్కూళ్లు, సినిమాహాళ్లు తప్ప..దాదాపు అన్నీ సాధారణ కార్యకలాపాలు జరుపుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో తెలంగాణ సర్కార్ కూడా.. మందుబాబులకు కూడా… ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ లాక్ ప్రకటించేసింది.
తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నందున లాక్ డౌన్ ప్రకటించాలన్న డిమాండ్.. నిన్నమొన్నటిదాకా వినిపించేది. ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచన చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ అలాంటి అవకాశం లేదని… తర్వాత తేల్చేశారు. తెలంగాణలో ఇక ఎలాంటి లాక్ డౌన్ నిబంధనలు అమల్లో లేనట్లే. కేంద్రం ఎప్పుడు అనుమతిస్తే.. అప్పుడు స్కూళ్లు, సినిమాహాళ్లు ప్రారంభమవుతాయి. లాక్ డౌన్ తర్వాత మద్యం దుకాణాలు తెరిచినప్పుడు.. తెలంగాణ సర్కార్కు ఆదాయం దండిగా వచ్చింది. అయితే.. ప్రజలకు ఆదాయం లేకపోవడంతో… తర్వాత కాస్త తగ్గింది. మళ్లీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
నిర్మాణ రంగంతో పాటు… వివిధ రకాల వ్యవస్థలు .. గాడిన పడుతున్నాయి. దీంతో… ప్రజల ఉపాధి కూడా పెరిగింది. మళ్లీ… మద్యం ఆదాయం కూడా పెరుగుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వానికి మద్యం ఆదాయం.. మరింత కలసి వస్తోంది. ఇప్పుడు సాధారణ సమయాల్లో అమ్మకాలు చేయడం వల్ల… లాక్ డౌన్ ముందు నాటి ఆదాయం వస్తుందని… ప్రభుత్వం ఆశిస్తోంది.