దేశంలో ఇప్పుడు పాదయాత్రల సీజన్ నడుస్తోంది. రాజకీయ నేతలు చేస్తున్నారు. చివరికి ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి.. బీహార్లో కూడా చేస్తున్నాడు. ఈ పాదయాత్రల్లో రకరకాలు ఉంటాయి. ఎవరికీ ఆంక్షలు లేవు. ఎవరినీ ఆధార్ కార్డులు అడగడం లేదు. ప్రజాస్వామ్య దేశంలో రోడ్డుపై నడవడానికి.. నడుచుకుంటూ వెళ్లడానికి ఆంక్షలు లేవు. కానీ కొంత మందిపై మాత్రమే ఉంటున్నాయి. అలాంటి వారిలో అమరావతి రైతులు ఉన్నారు. ఇంకా విశేషం ఏమిటంటే వారికి మద్దతు తెలిపే వారిపైనా ఆంక్షలు విధించడం.
కోర్టు ఆరు వందల మంది రైతులకు మాత్రమే పాదయాత్ర చేయాలని పర్మిషన్ ఇచ్చింది. కోర్టు తీర్పు రాక ముందే ఆధార్ కార్డులు చూపించాలని పోలీసులు యాత్రపై విరుచుకుపడ్డారు. వారి ఉద్దేశం ఏమిటో స్పష్టమయిపోయింది. అదే అదనుగా పాదయాత్రకు మద్దతు వస్తున్న వారినీ అడ్డుకున్నారు. ఈ మొత్తం ఆంక్షలతో రైతులు అలసిపోయారు. కోర్టులోనే తేల్చుకుందామని వెనక్కిపోయారు. ఇదే అదనుగా బరి తెగించిన మంత్రులు ఇష్టారాజ్యంగా రైతులపై మాట్లాడుతున్నారు. ఆధార్ కార్డులు లేవంటున్నారు. వారు రైతులే కాదంటున్నారు.
భూములిచ్చిన వారు రోడ్డున పడ్డారు. అలా పడటమే కాకుండా.. నానా మాటలు పడాల్సి వస్తోంది. రైతుల పాదయాత్ర చేస్తే ప్రభుత్వానికి.. వైసీపీ నేతలకు ఎందుకు అంత భయమో ఎవరికీ అర్థం కావడం లేదు. వారి పాదయాత్రకు ఒక్క టీడీపీనే కాదు.. వైసీపీ మినహా అందరూ సమర్థిస్తున్నారనేది బహిరంగసత్యం. అందులో దాచేదేమి ఉండదు. కానీ దానిపై రాజకీయ ముద్ర వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలో చాలా మంది పాదయాత్రలు చేస్తున్నారు. ఎవరికీ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. చివరికి జగన్ కూడా పాదయాత్ర చేశారు. ఇలాంటప్పుడే ప్రజాస్వామ్యం పేరుకో కాదు.. పాటించే పాలకులు ఉండటం కూడా ఎంత ముఖ్యమో తెలుస్తుంది.