ఇరాన్ దేశంతో జరిగిన అణు ఒప్పందం చాలా చారిత్రాత్మకమైనదని అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా అభివరిస్తుంటే, అమెరికాతో తాము ఒప్పందం చేసుకొనంత మాత్రాన్న ఆ దేశాన్ని తాము నమ్ముతున్నట్లు కాదని, అసలు అమెరికాని ఎన్నటికీ విశ్వసించలేమని ఇరాన్ అధ్యక్షుడు హసాన్ రౌహానీ చెప్పడం విశేషం.
ఇరాన్-ఇరాక్ మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్న సమయంలో నియంతగా పేరొందిన ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ నుండి తమ దేశాన్ని కాపాడుకొనేందుకు, అగ్రరాజ్యాలను నిలువరించేందుకే ఇరాన్ అణ్వస్త్రాలు, క్షిపణులను తయారు చేసుకోవడం మొదలుపెట్టిందని చెప్పవచ్చును. ఆ కారణంగా అమెరికాతో సహా మరికొన్ని అగ్రరాజ్యాలు ఇరాన్ పై అనేక ఆంక్షలు విదించాయి. ఆ కారణంగా ఇరాన్ ఆర్ధిక పరిస్థితి నానాటికీ క్షీణించడం మొదలయింది. విధిలేని పరిస్థితుల్లో ఇరాన్ తన అణు కార్యక్రమాలను తగ్గించుకొనేందుకు అంగీకరించి అగ్రరాజ్యాలతో ఒప్పందాలు చేసుకొంది. అందుకు ప్రతిగా అగ్రరాజ్యాలు ఇరాన్ పై విదించిన ఆంక్షలు ఎత్తివేసాయి. కానీ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నందుకు అమెరికా సంబందిత సంస్థలకు, వ్యక్తులకు భారీ జరిమానా విధించింది. అందుకే అమెరికాను ఎప్పటికీ నమ్మలేమని ఇరాన్ అధ్యక్షుడు హసాన్ రౌహానీ అంటున్నారేమో? అమెరికాతో చేసుకొన్న ఒప్పందానికి తాము కట్టుబడి ఉంటామని, కానీ అమెరికా దానికి ఎంతకాలం కట్టుబడి ఉంటుందో తెలియదని ఆయన అన్నారు.
అమెరికాతో సహా అగ్ర రాజ్యాలన్నీ తమ పెరట్లో గుట్టలు గుట్టలుగా అణ్వస్త్రాలను పోగులు పెట్టుకొని కూర్చొని, నిత్యం అత్యాధునిక ఆయుధాలను తయారుచేసుకొంటూ, ఏదో ఒక కారణంతో…ఏదో ఒక దేశంపై వాటిని ప్రయోగించి పరీక్షించి చూసుకోవడం ప్రపంచం అంతా చూస్తోంది. ఒకసారి వియత్నాం మీద..మరోసారి ఇరాక్..ఇంకోసారి ఆఫ్ఘనిస్తాన్..పాకిస్తాన్..సిరియా..ఇలాగ నిత్యం ఏదో ఒక దేశంపై తను తయారు చేసుకొంటున్న ఆయుధాలను అమెరికా ప్రయోగించి పరీక్షించుకొంటూనే ఉంది. ఎందుకంటే శాంతి స్థాపన కోసమే యుద్ధం చేస్తోందని చెప్పుకొంటుంది. కానీ అది ఎంతగా యుద్ధం చేస్తుంటే, అంతగా ప్రపంచ వ్యాప్తంగా అశాంతి, అరాచకం పెరిగిపోవడం కళ్ళకు ప్రత్యక్షంగా కనబడుతోంది.
ఒకవైపు ఎప్పటికప్పుడు అత్యాధునిక ఆయుధాలు తయారు చేసుకొంటూనే ఇరాన్ వంటి చిన్న దేశం తన రక్షణ కోసం ఆయుధాలు తయారు చేసుకొంటే జరిమానా విదించడం అమెరికాకి మాత్రమే చెల్లునేమో? ఆ లెక్కన చూస్తే అమెరికా పోగేసుకొన్న అణ్వస్త్రాలకు, తయారుచేసుకొంటున్న ఆత్యాధునిక ఆయుధాలకు అమెరికాపై ఎటువంటి ఆంక్షలు విదించాలి? ఎంత జరిమానా విదించాలి? అనే సందేహం కలుగుతుంది. కర్ర ఉన్నవాడిదే బర్రె అన్నట్లుగా అమెరికా వ్యహారం సాగుతోందని చెప్పకతప్పదు.