నారాయణ్‌ఖేడ్ పరువునిలిపింది అన్నాడు హరీష్‌రావు సన్నిహితులొకరు. అంటే మెజారిటీ బాగా రావడం గురించి కాదు. జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో నగరంలో కనిపించకుండా చేసినా అక్కడ ఉప ఎన్నిక వుంది గనక చెప్పుకోవడానికి ఏదో కారణం వుండింది అని. ఆ ఎన్నికల సమయంలోనే హరీష్‌ను మెదక్‌కు పరిమితం చేసే ప్రయత్నం తీవ్రస్థాయిలో జరిగిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కవిత ఢిల్లీ చూసుకుంటే కెటిఆర్‌కు హైదరాబాదు అంటే రాష్ట్రం అప్పగిస్తే హరీష్‌రావును మెదక్‌కు పరిమితం చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆ మాటకొస్తే వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల సమయంలో హరీష్‌ను మిగిలిన వారిలా ఒక నియోజకవర్గానికే పరిమితం చేసినప్పుడే ప్రాధాన్యత తగ్గించడం మొదలైందని ఒక పాత్రికేయుడి విశ్లేషణ. అయితే మెదక్‌కు పరిమితం చేసినా అన్ని చోట్ల నుంచి పార్టీ వారు వచ్చి ఆయనను కలుసుకోకుండా ఎవరూ ఆపలేరని సహాయకులొకరు సవాలు చేశారు. అయితే నివాసానికి వచ్చి కలిసే ప్రజా ప్రతినిధుల సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గడం కనిపిస్తూనే వుంది. ఇది ఆయనపై అయిష్టంతో గాక అధినేత కుటుంబ సభ్యులకు ఆగ్రహం వస్తుందనే సంకోచం వల్లనేనని కూడా కొందరు సన్నిహితుల కథనం. ఆచితూచి మాట్లాడే వ్యక్తిగా ఆయన బయిటపడే ప్రసక్తి లేదని అయితే జరిగే పరిణామాలు మౌనంగా గమనిస్తున్నారని చెబుతున్నారు. ఇవన్నీ ఎన్ని చేసినా పార్టీలో సమాంతర బిందువుగా ఆయన స్థానం చెరిగేది కాదన్న భరోసా కూడా అనుయాయుల్లో వుంది. ఇవన్నీ వున్నా ప్రస్తుతానికి ఒకింత తగ్గి వ్యవహరించడం మంచిదనే ఆలోచనలో వున్నట్టు అర్థమవుతుంది.