ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ జోస్యం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అపహాస్యం పాలయింది. దాంతో ఆయన సైలంట్ అయిపోయారు. ఈసారి జరిగిన ఆంధ్ర ఎన్నికల సందర్భంగా ఆయన సర్వేలు అన్నీ లోగుట్టుగానే వుండిపోయాయి. అయితే ఇప్పుడు ఆయన తన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వచ్చే నెల 19న ప్రకటిస్తానని చెప్పి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. వచ్చే నెల 19 అంటే కౌంటింగ్ కు జస్ట్ కొద్ది రోజలు ముందుగా అన్నమాట.
ప్రస్తుతం అమెరికాలో వున్న లగడపాటి అక్కడ ఓ సన్మాన సభలో మాట్లాడుతూ ఈ ఎగ్జిట్ పోల్ సంగతి వెల్లడించారు. అంటే లగడపాటి ఇప్పటికే సర్వే చేసి, ఫలితాలు రాబట్టి, రెడీగా వుంచుకున్నారన్నమాట. అయితే ఈ ఫలితాలు ఎలా వుండబోతున్నాయన్నది కూడా ఆయన సూత్ర ప్రాయంగా వెల్లడించేసారు. ”ఏపీలో సంక్షేమం, అభివృద్ధి చేసిన వారికే ప్రజలు పట్టం కడతారని” లగడపాటి వెల్లడించారు. అంటే తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతోందని ఆయన చెప్పకనే చెప్పారనుకోవాలి.
అయితే ఇలా అంటే, జనాలు ”ఆ..చెప్పావులే..తెలంగాణ టైమ్ లో చెప్పిన జోస్యం ఏమయిందో మాకు తెలుసు” అని ట్రోలింగ్ మొదలెడుతారేమో అని ఓ ముక్తాయింపు మాట కూడా జోడించారు. తెలంగాణలో తన జోస్యం ఎందుకు తప్పిందో కూడా మే 19న ఎగ్జిట్ పోల్స్ తో పాటు వెల్లడిస్తానని అన్నారు.
సో. గెట్ రెడీ. ఎగ్జిట్ పోల్స్ తెలుసుకోవడానికి కాదు. అది ఎలాగూ హింట్ ఇచ్చేసారు. తెలంగాణ లో సర్వే ఫెయిల్యూర్ కు ఏయే సాకులు చెబుతారో తెలుసకోవడానికి.