ఆయన దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా చేసి పదవీ విరమణ చేసిన వ్యక్తి కానీ ఆ హోదాకి గౌరవానికి తగినట్లుగా మాట్లాడలేరు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఆయనే జస్టిస్ మార్కండేయ కట్జూ.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “పాకిస్తానీలు…మన మద్య ఉన్న గొడవలకి శాస్వితంగా ఫుల్ స్టాప్ పెట్టేద్దాము. మీకు కాశ్మీర్ ఇచ్చేసేందుకు మేము సిద్దంగా ఉన్నాము. కానీ ఒక షరతు. దానితో బాటు మీరు బిహార్ రాష్ట్రాన్ని కూడా తీసుకోవాలి. ఇది ప్యాకేజి డీల్. దీనిలో మీకు ఒకటే ఆప్షన్. తీసుకొంటే రెంటినీ కలిపే తీసుకోవాలి. లేకుంటే ఏదీ అడగకూడదు. రెండూ తీసుకొన్నా తీసుకోకపోయినా కాశ్మీర్ ఒక్క దానిని మాత్రం మీకు ఇవ్వం. ఈ డీల్ మీకు ఓకేనా?” అని ట్వీట్ మెసేజ్ పోస్ట్ చేశారు.
అంతే కాదు..ఆనాడు ఆగ్రా సమావేశంలోనే పాకిస్తాన్ కి అప్పటి ప్రధాని వాజపేయి ఈ ఆఫర్ ఇచ్చారని, కానీ పాక్ అప్పుడు దానిని వదులుకొందని, కనుక తాను మళ్ళీ పాకిస్తాన్ కి మరో అవకాశం ఇస్తున్నానని మరో ట్వీట్ చేశారు.
ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహించిన జెడియు ప్రధాన కార్యదర్శి కెసి త్యాగి ‘ఆ స్థాయి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏ మాత్రం సహించలేమని’ అన్నారు. ‘ఆయనపై దేశద్రోహ నేరం మోపి చట్ట ప్రకారం తక్షణం చర్యలు తీసుకోవాలని’ బిహార్ భాజపా అధికార ప్రతినిధి వినోద్ నారాయణ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఆయన అన్న ఈ మాటలు వింటే ఇటువంటి విచిత్రమైన, మానసిక పరిపక్వత లేని వ్యక్తి అంత కాలం అంత అత్యున్నతమైన, కీలకమైన పదవిలో ఏవిధంగా బాధ్యతలు నిర్వర్తించారో అనే అనుమానం కలుగక మానదు. ఆయన చేసిన ఈ అనుచిత వ్యాఖ్యల పట్ల బీహారీలే కాదు యావత్ భారతీయులకి ఆగ్రహం కలుగక మానదు. ఒకపక్క అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ కాశ్మీర్ అంశం లేవనెత్తుతూ అది తమదేనని వాదిస్తుంటే, ఒక న్యాయమూర్తిగా పనిచేసిన కట్జూ ‘కాశ్మీర్ ఇచ్చేస్తాం..దానితో బాటు బిహార్ కూడా పట్టుకుపొండి’ అని కుళ్ళు జోకులు వేయడం చాలా దారుణం.
డిల్లీ జె. ఎన్.యు విద్యార్ధి కన్నయ్య కుమార్ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాడని ఆరోపిస్తూ కేంద్రప్రభుత్వం అతనిపై తక్షణం చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆరోపణలు నిరూపించడానికి బలమైన ఆధారాలు లేకపోవడంతో విడిచిపెట్టేసింది. కానీ కట్జూ చేసిన ఈ వ్యాఖ్యలకి ట్వీటర్ లో లిఖితపూర్వకమైన ఆధారాలు ఉన్నాయి. ఆయన దీనిని ఒక జోక్ గానే భావిస్తుండవచ్చు కానీ అది భారత్ ప్రతిష్టని మంటగలిపేదిగా ఉంది. ముఖ్యంగా బిహార్ రాష్ట్రాన్ని కించపరుస్తూ, అక్కడి ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసేదిగా ఉంది. కనుక ఆయన మళ్ళీ ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించేందుకు కేంద్రప్రభుత్వం తప్పనిసరిగా ఆయనపై చర్యలు తీసుకోవాలి. లేదా ఎవరో ఒకరు ఆయనపై కేసు వేసి కోర్టుకి ఈడ్చకమానరు.