ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవలి కాలంలో వైసీపీ, జనసేన, బీజేపీ నుంచి మూకుమ్మడి దాడిని ఎదుర్కొంటున్నారు. రాజకీయాల్లో అదంతా భాగమే. వారితో ఎలా రాజకీయం చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసు. కానీ ఇటీవలి కాలంలో.. టీడీపీ అధినేతపై…ఊహించని వైపు నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రిటైర్డ్ ఆఫీసర్లు పనిగట్టుకుని మరీ.. సమయం, సందర్భం లేకపోయినా… కావాలనే చేయాలన్నట్లుగా.. చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వంపై వీరు అవినీతి ఆరోపణలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు.
చంద్రబాబుపై, టీడీపీపై ఈ రిటైర్డ్ ఆఫీసర్ల రాజకీయం… ఐవైఆర్ కృష్ణారావుతో ప్రారంభమయింది. చంద్రబాబు ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పని చేసిన కృష్ణారావు.. అమరావతిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో అమరావతిలో దొరికే అవకాశాలు ప్రపంచంలో మరెక్కడా దొరకవని మీడియాలకు ఇంటర్యూలు ఇచ్చారు. పదవి విరమణ తర్వాత… ప్రత్యేకంగా ఐవైఆర్ కోసమే అన్నట్లుగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. చైర్మన్ పోస్టు ఇచ్చింది. వంద కోట్ల రూపాయల బడ్జెట్ కూడా కేటాయించింది. కానీ కొద్ది రోజులకు ఆయన మరింత ఉన్నతమైన పదవిని కోరున్నారేమో కానీ ప్రభుత్వం లైట్ తీసుకుంది. అప్పట్నుంచి చంద్రబాబుపై, ప్రభుత్వంపై పగ పెంచుకున్నారు. ప్రభుత్వ పదవి నుంచి తప్పించడంతో నేరుగా జగన్ క్యాంప్‌లో చేరిపోయారు. ఇప్పుడు జగన్ మీడియాలోనే కనిపిస్తూ.. అమరావతిపై ఆరోపణలు చేస్తూంటారు. ఇటీవల ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తకాన్ని అచ్చువేయించి పవన్ కల్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఇప్పుడు కూడా అడపాదడపా అమరావతిపై ఆరోపణలు చేస్తూనే ఉంటారు.
ఐవైఆర్‌కి తోడుగా సీఎస్ గానే పనిచేసిన కల్లాం అజయ్ రెడ్డి అనే అధికారి కూడా చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. సీఎస్‌గా ఈయన పదవీ కాలం పొడిగింపు కోసం.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. కానీ అనుమతి లభించలేదు. ఆ అసంతృప్తిని మనసులో పెట్టుకున్నారేమో కానీ… ప్రత్యేకంగా మీడియాను పిలిచి మరీ ఏవో ఆరోపణలు గుప్పించారు. తాజాగా జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్న జస్టిస్ ఈశ్వరయ్య అనే పెద్దమనిషి కూడా కొద్దిగా వ్యూహం మార్చి.. కులం ప్రకారం ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆయన చెప్పుకొస్తున్నారు.
వీరికి జగన్ మీడియా అత్యధిక ప్రాధాన్యం ఇస్తూండటంతో.. ఆటోమేటిక్ గా వీరి వెనుక వైసీపీ ఉందనే భావం ప్రజల్లోకి వెళ్లిపోతోంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందో లేదో కానీ… ఈ అధికారుల రెప్యూటేషన్ మాత్రం పూర్తిగా దెబ్బతింటోంది. ఇన్ని రకాల ఆరోపణలు చేస్తున్న వారు..ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారన్న అనుమానాలు ప్రజల్లో కూడా వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా.. వీరి వ్యవహారాల్ని లైట్ తీసుకుంటున్నారు. ఉపాధి లేక వారంతా.. ఆ పని చేస్తున్నట్లుగా సెటైర్ వేశారు. కానీ వరుసగా రిటైర్డ్ అధికారులు ఆరోపణలు చేస్తూ ఉంటే.. నమ్మేవాళ్లు కొంత మందైనా ఉంటారు.