రిటైర్మెంట్ హోమ్స్ అంటే.. రిటైరయ్యేలోపు ఓ ఇంటిని రెడీ చేసుకుని అందులో ప్రశాంతంగా జీవించడం కాదు. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న జీవన ప్రమాణాలను బట్టి రిటైర్మెంట్ హోమ్స్ అర్థం కూడా మారిపోతోంది. పాశ్చాత్యదేశాల తరహా సౌకర్యాలతో రిటైర్మెంట్ హోమ్ ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయి.
రిటైరైన ఇప్పుడున్న మైక్రో ఫ్యామిలీ వ్యవస్థలో పిల్లలతో కలసి ఉండటం అసాధ్యంగా మారుతోంది. సాధారణంగా పిల్లలు విదేశాలకో ఇతర నగరాలకో ఉపాధి కోసం వెళ్లిపోతున్నారు. వారితో వెళ్లి ఉండలేరు. ఒక వేళ ఒకే నగరంలో ఉన్నా సరే.. ఉండే పరిమితులు, జీవన శైలి కారణంగా కలిసి ఉండటం కష్టం. అదే సిటీ వాతావరణానికి దూరంగా వెళ్లాలని అనుకుంటారు. అలాగని సొంత ఊళ్లకు వెళ్లి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకునే పరిస్థితి లేదు. అందుకే ప్రశాంతంగా ఉండేలా హైదరాబాద్ శివార్లలోనే రిటైర్మెంట్ హోమ్స్ ప్రాజెక్టులను ఎంచుకుంటున్నారు.
కాస్త వయసు పెరిగే వారి అవసరాలను దృష్టి పెట్టుకుని లగ్జరీ కన్నా.. సౌకర్యానికి ప్రాధాన్యత నిస్తూ ఈ ఇళ్లను బిల్డర్లు నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ప్రాజెక్టులను అధ్యయనం చేసి ఎక్కువగా మెట్లు లేకుండా.. అత్యంత భద్రతతో కూడిన బాత్ రూములతో పాటు ఎప్పటికప్పుడు వృద్ధులకు వచ్చే ఆరోగ్య సమస్యలకు కూడా వెంటనే పరిష్కారం లభించే సర్వీస్ ఉండేలా కొత్త సౌకర్యాలతో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఓఆర్ఆర్ దాటిన తర్వాత ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో కొన్ని రిటైర్మెంట్ హోమ్స్ ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.