Return of The Dragon Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
‘లవ్ టుడే’తో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్. ఆ సినిమాతో యూత్ లో తనకు మంచి పేరు వచ్చింది. ఓరి దేవుడా సినిమాతో అలరించిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు. ఈ ఇద్దరు కలసి ఇప్పుడు ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలాంటి వినోదాన్ని పంచింది? ప్రదీప్ రంగనాథన్ మరోసారి తెలుగు తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్నాడా ?
డి.రాఘవన్ అలియాస్ డ్రాగన్ (ప్రదీప్ రంగనాథన్) ఇంటర్ వరకూ టాపర్. ఇంజనీరింగ్ లో ఒక్కసారిగా బ్యాడ్ బాయ్ గా మారిపోతాడు. డ్రాగన్ లో అల్లరి, పెంకితనం చూసే క్లాస్ మేట్ కీర్తి (అనుపమ పరమేశ్వరన్) ప్రేమలో పడుతుంది. డ్రాగన్ కి చదువుపై అస్సలు ధ్యాస వుండదు. 48 సప్లీలు వెనకేసుకుని బీటెక్ లో డుమ్మా కొట్టేస్తాడు. కాలం గడుస్తుంది. ప్రేమించిన అమ్మాయి కీర్తి లైఫ్ లో సెటిల్ కాని కారణంగా డ్రాగన్ కి బ్రేకప్ చెప్పి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. రోషం పొడుచుకొచ్చిన డ్రాగన్ ఓ మిత్రుడి సలహాతో ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. ఒక్కసారిగా తన జీవితం మారిపోతుంది. ఇల్లు, కారు, పెళ్లి అన్నీ సెట్ అవుతాయి. ఇంతలో డ్రాగన్ కాలేజ్ ప్రిన్సిపల్ కు ఫేక్ సర్టిఫికెట్ల సంగతి తెలుస్తుంది. తర్వాత ఏం జరిగింది? ఫేక్ డిగ్రీతో జాబ్ తెచ్చుకున్న డ్రాగన్ ఎలాంటి పరిస్థితులు ఎదురుకున్నాడు? తన నిజస్వరూపం బయటపడిందా? ఇదంతా తెరపై చూడాలి.
జనాలు రిలేట్ చేసుకునే పాయింట్ ని తీసుకుంటే సగం మార్కులు పడిపోయినట్లే. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లో కూడా ఇదే జరిగింది. ఇదేం కొత్త ఐడియా కాదు. జనాల్లో, ముఖ్యంగా బీటెక్ నేపధ్యం వున్న ప్రతి ఒక్కరికి పరిచయమైన పాయింటే. ఇంత రిలేటబుల్ గా వుండే పాయింట్ కి కావాల్సిన వినోదం జోడించి చెప్పిన ఈ కథ గొప్ప సినిమా అనలేం కానీ టైం పాస్ కి డోకా లేని సినిమా.
చదవాల్సిన సమయంలో చదవకుండా, డిగ్రీ అంటే లెక్కలేకుండా, షార్ట్ కట్ లో లైఫ్ లో సెటిల్ అయిపోదామనే ఓ కుర్రాడి కథ ఇది. నిజానికి ఇలాంటి పాయింట్ ఊహించినప్పుడు మెసేజ్ ఇచ్చి క్లాస్ పీకే సినిమా అవుతుందేమో అనే భయం రావడం సహజం. కానీ దర్శకుడు దాన్ని జనరలైజ్ చేయకుండా డ్రాగన్ అనే క్యారెక్టర్ కే కథని పరిమితం చేయడంతో ఎక్కడ కూడా క్లాస్ పీకుతున్న ఫీలింగ్ రాదు.
డ్రాగన్ పాత్ర కోణం నుంచే కథ మొదలౌతుంది. ఆ పాత్ర గురించి ప్రిన్సిపల్ ఇచ్చే ఇంట్రో క్యారెక్టర్ పై ఆసక్తిని పెంచుతుంది. డిగ్రీలేకుండా డ్రాగన్ చేసే ఓ ఫేక్ ఉద్యోగం అంత ఆసక్తికరంగా వుండదు కానీ ప్రేమ కోణంలో వచ్చే సంఘర్షణ కథని మలుపు తిప్పుతుంది. డ్రాగన్, కీర్తి లవ్ స్టోరీ షార్ట్ గా చెప్పినప్పటికీ డ్రాగన్ క్యారెక్టర్ లవ్ స్టోరీ మార్పుకి కారణం కావడం బాగా కుదిరింది. ఆ తర్వాత ఇంటర్వెల్ ముందు వరకూ కాస్త సాగదీసినట్లుగానే వుంది. ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ తో మాత్రం టైటిల్ జస్టిఫికేషన్ జరిగిపోయింది.
ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల సీన్స్ నిదానంగా నీరసం తెప్పించేలా వుంటాయి. కానీ ఆ సీన్స్ కి పే అఫ్ సెకండ్ హాఫ్ లో ఇచ్చిన విధానం బావుంది. డ్రాగన్ క్యారెక్టర్ కాలేజ్ డేస్ జీవితం చాలా చిరాగ్గా వుంటుంది. దానికి సెకండ్ హాఫ్ లో `ఛోటా డ్రాగన్’ అనే ఓ క్యారెక్టర్ ని పెట్టి .. హీరో చేతే ‘నేను ఇంత దారుణంగా వుండేవాడినా’ అని చెప్పించినప్పుడు భలే నవ్వొస్తుంది. అలాగే ఎయిర్ పోర్ట్ బర్త్ డే సీన్ కూడా పండింది. కీర్తి క్యారెక్టర్ మళ్ళీ లెక్చరర్ గా రావడం ప్రేమమ్ ని గుర్తు తెస్తుంది కానీ ఇది స్వీట్ గా కుదిరింది.
ప్రదీప్ రంగనాథన్ తనకంటూ ఒక స్టయిల్ క్రియేట్ చేసుకున్నాడు. డ్రాగన్ పాత్రలో ఒదిగిపోయాడు. సెకండ్ హాఫ్ లో తన పాత్ర ఇంకా బావుంది. అనుపమ పరమేశ్వరన్ పాత్ర నిడివి తక్కువ అయినపటికీ ఆ ట్రాక్ డీసెంట్ గా వుంది. కయదూ అందంగా కనిపించింది. మిస్కిన్ క్యారెక్టర్ ఇందులో ఓ సర్ ప్రైజ్. ఆ పాత్రతో ఓ పెద్దరికం తీసుకొచ్చారు. పాటలు గుర్తుపెట్టుకునేలా వుండవు కానీ నేపధ్య సంగీతం మాత్రం లైవ్లీగా వుంది. తెలుగు డబ్బింగ్ బాగానే కుదిరింది.
ఇష్టపడి కష్టపడి చదివి డిగ్రీ తీసుకొని జీవితంలో స్థిరపడాల్సిన సమయాన్ని వృధా చేస్తే, జీవితం ఎంత కష్టంగా తయారౌతుందో, ఫేక్ చేసి బ్రతికితే నిత్యం ఎంత భయంతో ఉండాలో, నకిలీ పత్రాలతో ఉద్యోగం పొందితే జీవితాలు ఎలా తలకిందులు అవుతాయో.. ఇలాంటి సీరియస్ పాయింట్లు అన్నీ షుగర్ కోటింగ్ తో చెప్పిన ఈ సినిమా ముఖ్యంగా యూత్ కి నచ్చే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ఈ వీకెండ్ సరదాగా ఈ సినిమాపై ఓ లుక్ వేయొచ్చు.
తెలుగు360 రేటింగ్: 2.5/5