కామెడీ నుంచి హీరోయిజానికి, మళ్లీ హీరోయిజం నుంచి కామెడీకి టర్న్ అయ్యాడు సునీల్. హాస్య నటుడి నుంచి హీరో అవ్వాలని తీసుకున్న నిర్ణయం మంచిదో కాదో సునీల్ కెరీర్ ని చూస్తే అర్థమైపోతోంది. కథానాయకుడిగా సునీల్ సాధించిందేం లేదు. చివర్లో అయితే వరుస ఫ్లాపులు తగిలాయి. మళ్లీ హాస్య పాత్రలవైపు మొగ్గు చూపడం, హీరోయిజాన్ని వదిలేయడం మాత్రం కచ్చితంగా తనకు లాభదాయకమే. దానికి తగ్గట్టుగా ఇటీవల తనకు కొన్ని మంచి అవకాశాలు కూడా వచ్చాయి, వస్తున్నాయి.
అయితే ఆయా సినిమాల్లో సునీల్ రాణించిందెంత? అని అడిగితే మాత్రం సరైన సమాధానం రాదు. `అరవింద సమేత`లో సునీల్ పాత్ర అంతగా పేలలేదు. ఆ పాత్ర ఉద్దేశం కామెడీ సృష్టించడం కాదు కాబట్టి.. సో సోగా ఉన్నా సర్దుకుపోవొచ్చు. `అమర్ అక్బర్ ఆంటోనీ`లో సునీల్ పాత్ర పేలవంగా సాగింది. నిజానికి ఈసినిమాలోని పాత్రలన్నీ అదే టైపు. అందులో సునీల్ పాత్ర కూడా కొట్టుకెళ్లిపోయింది. తాజాగా `పడి పడి లేచె మనసు`లోనూ సునీల్ తన పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. సెకండాఫ్‌లో తనది కీలకమైన పాత్రే. నవ్వించే ఛాన్స్ కూడా ఉంది. కానీ.. సునీల్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ… ఇలా ఏది చూసినా.. ఫన్ పండలేదు. పాత సునీల్ ని ఎంత వెదికినా ఈ సునీల్‌లో కనిపించలేదు. కొన్ని సందర్భాల్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేని సునీల్‌ని చూస్తుంటే, సునీల్ నవ్వించడం కూడా మర్చిపోయాడా? అనే అనుమానం వేస్తుంది. సునీల్ నుంచి ఆశించేది నవ్వులే. ఇలా కామెడీ పాత్రలు చేస్తున్నప్పుడు మరింత ఫన్ ఆశిస్తాం. అది కూడా అందివ్వకపోతే. అది రచయితల తప్పా? సునీల్ తప్పా?? ఇలాంటి ప్రాధాన్యం లేని పాత్రలు ఎంచుకుంటూ పోతే.. హాస్యనటుడిగానూ తన కెరీర్ ప్రమాదంలో పడే ఛాన్సుంది. ఈ విషయాన్ని సునీల్ త్వరగా గుర్తిస్తే మంచిది.