గ్రేటర్ ఎన్నికలలో 100 సీట్లు రాకపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కె.టి.ఆర్. శపథం చేసినప్పుడు వెంటనే తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆ సవాలుని స్వీకరించేసి తెరాస వంద సీట్లు గెలిస్తే తను రాజకీయ సన్యాసం చేస్తానని, తెలంగాణా రాష్ట్రాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోతానని ప్రతి సవాలు చేసారు. అలాగే ఓ వృద్ద కాంగ్రెస్ నేత కూడా ‘రాజకీయ సన్యాసానికి సిద్దం’ అని కమిట్ అయిపోయేరు. సిపిఐ నారాయణ చెవులు తెగ్గోయించుకొంటానని ప్రామిస్ చేసారు. వారి ప్రతిసవాళ్ళను చూసి కె.టి.ఆర్. కొంచెం వెనక్కి తగ్గి “మేయర్ పదవి దక్కించుకోకపోతే రాజీనామా” అని తన సవాలుకి సవరణ ప్రకటన జారీ చేసి సేఫ్ అయిపోయారు.
గ్రేటర్ ఎన్నికలలో తెరాస పార్టీ ప్రతిపక్షాలను పూర్తిగా తుడిచిపెట్టేయగలిగింది కానీ సచిన్ టెండూల్కర్ లాగ 99 వరకు వచ్చి ఆగిపోయింది. కనుక ఇప్పుడు ఎవరూ రాజకీయ సన్యాసం చేయనవసరం తప్పింది. చెవులు ముక్కులు కోసుకోవలసిన కష్టం తప్పింది. అందరూ సేఫ్ అయిపోయారు. ఆ కారణంగా ఈ ఎన్నికలలో ప్రతిపక్షాలు ఘోరంగా ఓడిపోయినప్పటికీ అందరూ ఒడ్డున పడిపోయారు.
కాంగ్రెస్ పార్టీ చెప్పుకొన్నట్లుగానే ఈ ఎన్నికలలో కేవలం రెండే రెండు సీట్లు గెలుచుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ ‘సింగిల్ డిజిట్’ కి పరిమితమయ్యి రికార్డు సృష్టించబోతోందని తెరాస జోస్యం కూడా నిజమయింది కనుక దానికీ సంతోషమే. “ఈ ఎన్నికలలో తెదేపా-బీజేపీ కూటమి గెలవబోదు” అని నారా లోకేష్ చెప్పిన జోస్యం కూడా నిజమయింది కనుక ఆయన కూడా తన రాజకీయ పరిజ్ఞానానికి సంతోషించవచ్చును. కాకపోతే ‘కింగ్ మేకర్’ జోస్యం నిజమవకపోవడం చేత ఆయనకు కొంత బాధ కలుగవచ్చును. మొత్తంగా చూసుకొంటే అందరూ సంతోషించడానికి ఏదో ఒక బలమయిన కారణం కనబడుతోంది. కనుక ‘ఆల్ ఈజ్ వెల్’ అని చెప్పుకోవలసి ఉంటుంది.
గ్రేటర్ ఫలితాలు ఇలాగ ఉన్నాయి: తెరాస: 99, మజ్లీస్: 44, బీజేపీ: 4, తెదేపా:1, కాంగ్రెస్ పార్టీ: 2 స్థానాలు గెలుచుకొన్నాయి.