కేసీఆర్ ఇటీవల తన దత్తత గ్రామం వాసాలమర్రిపై ప్రత్యేక దృష్టి సారించారు. దళిత బంధు అక్కడి గ్రామాల్లో ఉన్న దళితులందరికీ ఇచ్చారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. అయితే కేసీఆర్ దత్తత గ్రామం అదొక్కటే కాదు. ఇంకా చాలా ఉన్నాయి. వాటిని పట్టించుకోవడం లేదనే అంశాన్ని హైలెట్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మేడ్చల్ జిల్లాలోని మూడు చింతలపల్లి అనే గ్రామం కూడా కేసీఆర్ దత్తత గ్రామమే. సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ధరణి వెబ్‌సైట్‌ను మూడు చింతలపల్లి నుంచే ప్రారంభించారు. కానీ సమస్యలు మాత్రం ఏమీ పరిష్కారం కాలేదు. వాసాలమర్రి వైభోగం చూసిన ఇతర దత్తత గ్రామాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడం సహజం. ఆ అసంతృప్తిని పీసీసీ చీఫ్ రేవంత్ వ్యూహత్మకంగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు.
మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో రేవంత్ దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేపడుతున్నారు. దళిత వాడలను సందర్శించి.. ప్రజల్నీ సీఎం ఎలా వంచించారో చెప్పనున్నారు. సీఎం దత్తత తీసుకుని సంవత్సరాలు గడుస్తున్నా పల్లెలలో.. దళిత వాడలనే అభివృద్ది చేయని ముఖ్యమంత్రి ఇక దళిత బంధును ఎలా ఇస్తారని వారికి చెప్పనున్నారు. మేడ్చల్ జిల్లాలో మూడుచింతలపల్లినే కాకుండా కేశవరం, లక్ష్మాపూర్ మూడు గ్రామాలను కూడా కేసీఆర్ 2017లో దత్తత తీసుకున్నారు. కానీ ఎలాంటి నిధులు.. అభివృద్ధి పనులు చేపట్టలేదు. గ్రామాల వాసులకు ప్రత్యేకంగా ఆర్థికసాయం ఇచ్చిందికూడా ఏమీ లేదు.
వాసాలమర్రిని కేసీఆర్ దత్తత గ్రామంగా ప్రకటించినప్పుడు ఆయన .. తన ఫాంహౌస్‌కు వెళ్లే దారి కోసం ఆ గ్రామాన్ని ఎంచుకున్నారన్న విమర్శలు కొంత మంది చేశారు. అయితే మేడ్చల్ జిల్లాలో ఆయన దత్తత తీసుకున్న మూడు గ్రామాలు ఎర్రవెల్లి ఫాంహౌజ్ కు వెళ్లే దారిలోనే ఉన్నాయి. తరచూ కేసీఆర్ అటు వెళ్తూంటారు. కేసీఆర్ గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన స్థలంలోనే కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష వేదికను ఏర్పాటు చేస్తున్నారు రేవంత్. మేడ్చల్ తను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కూడా కావడంతో ఈ దీక్షలను మరింత హైలెట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది.