కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు విషయంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విషయంలో ఢిల్లీ పోలీసుల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులే అందలేదు. బీజేపీ నేతల ఫిర్యాదుతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన అధికారులు గాంధీ భవన్ కు వెళ్ళడంతో రేవంత్ రెడ్డిని నిందితుడిగా గుర్తిస్తూ నోటీసులు ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ప్రధాన వార్తా పత్రికలన్నీ నోటీసులు అందినట్లుగా ప్రచురించడంతో రేవంత్ రెడ్డికి ఈ కేసు విషయంలో చిక్కులు తప్పవని అంచనా వేశారు.
అయితే, సీఆర్పీసీలోని సెక్షన్ 91 ప్రకారం ఏదైనా దర్యాప్తు కోసం పోలీసు అధికారి లిఖితపూర్వకంగా ఎవరికైనా సమన్లు జారీ చేయవచ్చు.సెక్షన్ 160 సీఆర్పీసీ ఆధారంగా సాక్షి హాజరు కోరుతూ సమన్లు జారీ చేయడానికి పోలీసులకు అధికారం ఉంటుంది. ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ ను బయటపెట్టకపోవడంతో ఈ కేసులో నిందితులుగా ఎవరిని చేర్చారనేది క్లారిటీ లేదు. ఇక, ఈ కేసులో రేవంత్ ను సాక్షిగా పరిగణించడంతో ఢిల్లీ పోలిసులకు రేవంత్ తరఫు న్యాయవాది సౌమ్య గుప్తా బుధవారం సాక్షి సమాధానం ఇచ్చారు.
అమిత్ షా నకిలీ వీడియో షేర్ వెనక రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు. రేవంత్ రెడ్డి సమాధానాన్ని ఢిల్లీ పోలీసులకు చేరవేసినట్లుగా సౌమ్య గుప్తా వెల్లడించారు. దీంతో ఈ కేసులో రేవంత్ కు నోటీసులు అందినట్లుగా జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టమైంది. ప్రధాని మోడీ – సీఎం రేవంత్ రెడ్డిలను బడే భాయ్, చోటే భాయ్ అంటూ ప్రచారం జరగడంతో ఈ కామెంట్స్ కు చెక్ పెట్టేలా రేవంత్ కు నోటీసులు ఇష్యూ చేసినట్లుగా ప్రచారం చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.