తమ్ముళ్లు తగాదా పడ్డారు. ఉమ్మడి అభ్యర్థిపై చర్చించడానికి బదులు హోరాహోరీగా మాటలయుద్ధం చేశారు. ప్రత్యర్థులతో పోరాడాల్సిన వారు పరస్పరం కలహించుకున్నారు. వరంగల్ ఉఫ ఎన్నిక వ్యవహారంపై టీ టీడీపీ నేతలు హైదరాబాదులోని ఒక హోటల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగినట్టు సమాచారం.
చర్చల సందర్భంగా ఇద్దరి మధ్యా అనుకోకుండా మాటా మాటా పెరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. పరస్పరం తిట్టుకున్నారు. ఇక కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అనే స్థాయిలో అరుపులు కేకలతో ఆ ప్రదేశం దద్దరిలినట్టు తెలుస్తోంది. పార్టీ మీటింగ్ లకు ఐటం సాంగ్ లా వచ్చి పోతుంటావు నువ్వేంది నాకు చెప్పేదంటూ ఎర్రబెల్లి ఫైరయ్యారట. దీంతో రేవంత్ రెడ్డి కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చినట్టు సమాచారం.
ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆ కేసులో నీ వల్ల పార్టీ పరువు పోయిందంటూ ఎర్రబెల్లితోపాటు సీనియర్ నాయకులు అన్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డి అతిగా ప్రవర్తిస్తున్నారని సీనియర్లు మందలించారు. దూకుడు తగ్గించుకోవాలని, సీనియర్లను గౌరవించాలని వారు హితబోధ చేసినట్టు తెలిసింది. కొంత కాలంగా రేవంత్ రెడ్డి బాగా పాపులర్ అయ్యారు. ఓటుకు నోటు కేసుకు ముందు కూడా కేసీఆర్ తో పాటు తెరాస నాయకులపై విరుచుకు పడుతూ డైనమిక్ లీడర్ గా ఎదగడానికి ప్రయత్నించారు. దీంతో పలువురు సీనియర్లు ఆయన వైఖరిపై గుర్రుగా ఉన్నారు. అందుకే, ఎర్రబెల్లితో గొడవ పడ్డ రేవంత్ ను హద్దుల్లో ఉండాలని, పెద్దవాళ్లను గౌరవించాలని సీనియర్లు తలంటినట్టు సమాచారం.