మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ కాలయాపన బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ గా మారుతోంది. ఏడాదిన్నరకాలంగా కేబినెట్ విస్తరణ చేపట్టలేదని విమర్శిస్తూనే…రేవంత్ సర్కార్ ను ఇరకాటంలోకి నెట్టేలా ప్రచారాన్ని విస్తృతం చేస్తోంది. ఆశావహులు కూడా తొందరపాటు చర్యలతో బీఆర్ఎస్ చేతికి కత్తి అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
మంత్రివర్గ విస్తరణలో భాగంగా తనకు పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేసిన మరుసటి రోజే మరో నేత పెదవి విరిచారు. వివేక్ కుటుంబం తనకు కేబినెట్ లో చోటు దక్కకుండా ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆ లిస్టులో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహారి చేరినట్లుగా ఓ లేఖ బయటకు వచ్చింది.
ఎమ్మెల్యే టికెట్ కోసం 10 కోట్లు ఇచ్చామని, మంత్రి పదవి కోసం 100 కోట్లు ఖర్చు చేశామని తీరా మంత్రి పదవి వచ్చే సమయానికి అడ్డు పడుతున్నారు అంటూ వాకిటి శ్రీహరి అభిమానుల పేరిట బయటకు వచ్చిన లేఖ సంచలనం రేపుతోంది.నిజంగా ఈ లేఖ వాకిటి అభిమానులే విడుదల చేశారా అనేది అనుమానాస్పదంగా మారింది.
మంత్రివర్గ విస్తరణ జరిగితే వాకిటికి వచ్చిన డోఖా ఏమి లేదు. ఆయన సామాజిక వర్గంతోపాటు రేవంత్ ఇచ్చిన హామీ ఆయనకు పదవిని తప్పకుండా వరించేలా చేస్తుంది. అయినా, పార్టీకి వందకోట్లు ఇచ్చామని, పదవి ఇవ్వకపోతే రేవంత్ భరతం పడుతామని వాకిటి అభిమానులు లేఖ విడుదల చేశారా అంటే ఎవరికీ నమ్మశక్యంగా అనిపించడం లేదు.
వాకిటి శ్రీహరికి పదవిని అడ్డుకునేందుకు ఆయన వ్యతిరేకులు , రేవంత్ ను ఇరకాటంలోకి నెట్టివేసేందుకు ఈ లేఖను విడుదల చేసి ఉంటారని విమర్శలు వస్తున్నాయి. వీటిని లైట్ తీసుకుంటే కాంగ్రెస్ పై , రేవంత్ పై మరిన్ని విమర్శలు, ఆరోపణలు చెలరేగే అవకాశం ఉంది. మరి సర్కార్ ఎలాంటి చర్యలు చేపడుతుందో