హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే, ఓటుకు నోటు కేసులో నిందితుడు రేవంత్ రెడ్డి ప్రాణాలకు తీవ్రముప్పు ఉందని అతని సోదరుడు కృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అతను ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, రాత్రిసమయాలలో కొడంగల్‌లో తన సోదరుడు ఉంటున్న ఇంటివద్ద, హైదరాబాద్‌లో ఇంటివద్ద, అతను పాల్గొంటున్న కార్యక్రమాలవద్ద గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నారని చెప్పారు. తన సోదరుడికి ఏమైనా హాని జరిగితే కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్పారు. వెంటనే తమ సోదరుడికి ప్రభుత్వం తగిన భద్రత సమకూర్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే ఓటుకు నోటు కేసులో ఇరికించారని ఆరోపించారు. తెలంగాణలో టీడీపీ లేకుండా పోవాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు.
కేసీఆర్ కుటుంబంపై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తుండే రేవంత్‌ను ఓటుకునోటు కేసులో ప్రభుత్వమే ఇరికించిందని ఆరోపణలున్నాయి. జైలునుంచి బయటకొచ్చిన సమయంలో రేవంత్ కేసీఆర్ కుటుంబంపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. దీంతో రేవంత్‌కు ప్రాణహాని ఉందేమోనని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రేవంత్ కోసం ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కొనుగోలు చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంకూడా కొనుగోలు చేయటానికి ప్రయత్నిస్తున్నారు.