తెలంగాణ తెలుగుదేశఃం పార్టీ నేతలు తిట్ల దండకం మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డితో ప్రత్యక్ష పోరుకు సై అంటే సై అంటున్నారు. టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం అలా ముగిసిందో లేదో… తెలంగాణ నేతలు రేవంత్‌పై దండయాత్ర మొదలుపెట్టేశారు. కాంగ్రెస్‌తో భేటీపై రేవంత్ సమాధానం చెప్పాలని, తనకి పార్టీ మారే ఉధ్ధేశ్యం లేకుంటే ప్రెస్‌మీట్ పెట్టి ఎందుకు ఖండించడం లేదంటూ సూటిగా ప్రశ్నిస్తున్న తేదాపా నేతలు… ఇక రేవంత్‌పై ఆశలు పూర్తిగా వదిలేసుకుంటున్నామని తమ తిట్ల ద్వారా చెప్పకనే చెప్పేశారు.
రేవంత్ పార్టీ వీడినా తెలుగుదేశంకు వాటిల్లే నష్టం ఏమీలేదన్నారు అరవింద్ గౌడ్. మోత్కుపల్లి అయితే ఒంటికాలిపై లేచారు.ఇంత జరిగాక రేవంత్‌ను ఇంక పార్టీలో కొనసాగించాల్సిన పరిస్థితి ఎంత మాత్రం లేదని మోత్కుపల్లి స్పష్టం చేశారు. మంచివాడిలా నటిస్తూ పార్టీని భ్రష్టు పట్టించారంటూ రేవంత్‌ని తిట్టిపోశారు. అసలు రేవంత్ అడుగుపెట్టాకే పార్టీకి నష్టం వాటిల్లడం మొదలైందన్నారు. ఇంకా ముందుకెళ్లిన మోత్కుపల్లి ఓటుకు నోటు కేసు మొత్తం రేవంత్ పాపమేనంటూ వ్యాఖ్యలు చేయడం విశేషం.
ఇదిలా ఉంటే ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేతలకు ఇచ్చిన సూచనలు నాయకులు ఆచరించారా లేదా అనే సందేహం కలుగుతోంది. రేవంత్ పార్టీ మారడం దాదాపు ఖరారైన నేపధ్యంలో రేవంత్ విమర్శలపై సంయమనం పాటించాలని ఇరు రాష్ట్రాల్లోని నాయకులకు బాబు ఆదేశించినట్టు సమాచారం. అయితే దీనిని ఆంధ్రప్రాంత నాయకులు పట్టించుకున్నట్టుగా టిటిడిపి నేతలు పట్టించుకుంటున్నట్టు లేదు. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న తెలుగుదేశం పార్టీ యువ నేత లోకేష్ ఈ వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారని అంటున్నారు.
ఏదేమైనా… తాను నోరు విప్పితే అందరి బండారాలు బయటపడతాయని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానిస్తున్నాడు. కేవలం తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పార్టీకి చిక్కులు తెచ్చి పెట్టే చిట్టా తన దగ్గర ఉందన్నట్టు ఆయన ఇప్పటికే చెప్పకనే చెప్పాడు. ఈ నేపధ్యంలో తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్‌పై తమ విమర్శల పరంపర కొనసాగిస్తారా? లేక బాబు వారిని అదుపు చేస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్న రేవంత్… డికె అరుణ, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి తదితర కాంగ్రెస్ నేతల్ని ఒకరి తర్వాత ఒకరిని కలుస్తూ మార్గం సుగమం చేసుకుంటున్నాడు.