హైదరాబాద్ నగర జనాభా కోటిన్నరకు చేరుతోంది. హెచ్ఎండీఏ పరిధిలో 30 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి . ఇన్ని రకాల స్థానిక సంస్థలు ఉండటంతో మౌలిక సదుపాయాల విషయంలో వెనుకబాటు కనిపిస్తోంది. అందుకే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ముందడుగు వేస్తోంది. 30 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు కలిపేసి.. మొత్తంగా నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లుగా మార్చాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు.
ఔటర్ లోపల మొత్తం ఒకే హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్‌గా చేయాలని ప్రభుత్వం మొదట ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు కానీ అయితే అది పరిపాలనా పరంగా సరైన నిర్ణయం అనిపించుకోదని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ నగరాలుగా నాలుగు కార్పొరేషన్లుగా మారిస్తే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు ఇప్పటికే గ్రామాలుగా ఉన్న వాటిని సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. ఇప్పుడు ఆ మున్సిపాలిటీలను కూడా కార్పొరేషన్లుగా మార్చే ప్రణాళికలో ఉన్నారు.
ఇప్పుడున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీ కాలాలు మరో ఏడాది పైనే ఉన్నాయి. అందుకే ఆ పదవీ కాలంపూర్తయిన వెంటనే వాటికి స్పెషలాఫీసర్లను నియమించడం, అన్నింటి పదవీకాలం ముగిసిన తర్వాత విలీన ప్రక్రియను ప్రారంభించాలని మున్సిపల్ శాఖ అధికారులకు ఇప్పటికే సంకేతాలు వెళ్లాయి. మున్సిపాలిటీలు కార్పొరేషన్లను తెలంగాణ ఏర్పడిన తర్వాతనే ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు నిధుల పంపిణీలో అసమానతలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని డివిజన్లలో లక్ష మందికిపైగా జనాభా ఉండగా.. కొన్నింటిలో 30 వేల మంది మాత్రమే ఉన్నారు.
హెచ్ఎండీఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ్ పేట్, మీర్ పేట్ కార్పొరేషన్లు ఉన్నాయి. పేరుకే కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీ స్థాయిలో కూడా పనులు చేపట్టలేకపోతున్నారు. సిటీ విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వసతుల కల్పనకు కూడా ఈ నిర్ణయం ఉయోగపడుతోందని అనుకుంటున్నారు. ఈ నిర్ణయాలు రియల్ ఎస్టేట్‌కు కూడా మరింత ఊపు తీసుకు రానున్నాయి.