మార్గదర్శికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆ సంస్థపై నమోదైన అక్రమ డిపాజిట్ల కేసును కొనసాగించాలని కోర్టును కోరింది. ఈ అంశం ఉమ్మడి రాష్ట్రానికి సంబధించినది. అప్పట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ లేవనెత్తిన అంశం ఆధారంగా వైఎస్ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. నిజానికి ఇది ఆర్బీఐ పరిధిలోని అంశం. అప్పట్లో మార్గదర్శి ఈ ఆరోపణల కారణంగా డిపాజిట్ దారులందరికీ డబ్బులు చెల్లించేసింది.
తాజాగా ‘మార్గదర్శి’ కేసుపై శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అభిప్రాయాలను వెల్లడించాయి. ఏపీ ప్రభుత్వం రూ.5.15 కోట్లు ఎస్ర్కో ఖాతాలో ఉన్నాయని.. వాటిని ఇంకా 1,270 మంది డిపాజిటర్లుకు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. అందువల్ల ఆ మొత్తాన్ని ఆర్బీఐకిగానీ, రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని చెప్పింది. బౌగోళికంగా పరిశీలిస్తే కేసు నమోదైన దిగువ కోర్టు హైదరాబాద్లో ఉన్నందున ఈ కేసుతో ఏపీకి సంబంధం ఉండదని తెలిపింది.
అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం మార్గదర్శికి వ్యతిరేకంగా వైఖరి తీసుకుంది. మార్గదర్శి దాఖలు చేసిన పిటిషన్ను మేజిస్ట్రేటు కోర్టు కొట్టేసిందని, ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ వ్యవహారంపై ప్రాసిక్యూషన్ కొనసాగించాలని కోర్టుకు తెలిపింది. దీంతో మార్గదర్శిపై కేసు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.