తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాయి. ఏపీలో జగన్ సర్కారు, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం…. టాలీవుడ్ కు చేసిందేం లేదు. ఏపీలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ధారాళంగా ఇచ్చారు. అంత వరకూ ఓకే. కానీ పరిశ్రమకు కొత్తగా ఇచ్చిన వరాలు లేవు. తెలంగాణలో పరిస్థితి ఇంకాస్త కఠినంగా తయారైంది. చిత్రసీమ మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి తల వంచిన వైఖరి కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రితో ములాఖాత్ వల్ల టాలీవుడ్ కు ఒరిగిన లాభం ఏమిటన్నది ఎవరికీ అర్థం కాదు.
పరిశ్రమ – ప్రభుత్వం మధ్య సంబంధాలు పటిష్టంగా ఉండాల్సిందే. అప్పుడే టాలీవుడ్ కు మేలు జరుగుతుంది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిందేం లేదు. పైగా సినిమావాళ్లంటే చులకన భావం. కూటమి సర్కార్ తో ఆ గొడవ లేదు. కాకపోతే ఈ సంబంధాలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఏపీలో చిత్రసీమకు ప్రభుత్వం ఏం చేయబోతోందో ఓ స్పష్టత అవసరం. ఇక్కడ ఎలాగైతే రేవంత్ రెడ్డితో ఓ మీటింగ్ జరిగిందో, అలాంటిదే ఏపీలోనూ జరగాలి. టాలీవుడ్ కు ఏం కావాలో.. అడగగలగాలి. ఏపీ ప్రభుత్వం సినిమావాళ్ల పక్షపాతి. ఇందులో డౌటేం లేదు. కాకపోతే సినిమావాళ్లకూ, ప్రభుత్వానికీ మధ్య ఓ బలమైన వారధి అవసరం.
తెలంగాణలో ఆ బాధ్యత దిల్ రాజు తీసుకొన్నారు. ఆయన ఎఫ్డీసీ ఛైర్మన్ కూడా. అయితే తెలంగాణ ప్రభుత్వానికీ చిత్రసీమకూ మధ్య ఓ గ్యాప్ ఉంది. అది తగ్గాల్సిన అవసరం కూడా ఉంది. టికెట్ల రేట్ల పెంపుదలపై తెలంగాణ ప్రభుత్వ తాజా వైఖరి ఎలా ఉంటుందన్నది సంక్రాంతి సినిమాలతో తేలిపోతుంది. ‘టికెట్ రేట్లు పెద్ద విషయం ఏం కాదు’ అని దిల్ రాజు పైకి అంటున్నా, ఈ సంక్రాంతికి టికెట్ రేట్లు పెరుగుతాయా, పెరిగితే ఏ మొత్తంలో అనే భయం ఆయనకూ ఉంది. ఎందుకంటే ఈ పండక్కి వస్తున్న మూడు సినిమాల్లో రెండు ఆయనివే. పైగా వాటిలో ఒకటి అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన ‘గేమ్ ఛేంజర్’. టికెట్ రేట్ల పెంపుదల పెద్ద మేటర్ కానప్పుడు గతంలో రేట్లు పెంచాల్సిందే అంటూ గగ్గోలు పెట్టడం ఎందుకు? ఎట్టిపరిస్థితుల్లోనూ అగ్ర నిర్మాతల అజెండా.. టికెట్ రేట్ల పెంపుదలే. అందులో అనుమానం లేదు. పోనీ.. ఈ విషయాన్ని పక్కన పెడితే – టాలీవుడ్ కు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోంది? అనే విషయంలోనైనా క్లారిటీ అవసరం. 2024లో తెలుగు చిత్రసీమ సాధించుకోలేనివి.. ఈ కొత్త యేడాదైనా దక్కించుకోవాలి. అందుకు ఏం చేయాలో.. టాలీవుడ్ పెద్దలంతా కలిసి ఆలోచించాలి. కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గడం మంచిదే. కానీ.. ప్రతీసారీ వెనకే ఉంటే.. పూర్తిగా వెనుకబడిపోయే ప్రమాదం ఉందన్న సంగతి సినీ పెద్దలు గుర్తించుకోవాలి.