రేవంత్ రెడ్డి పాదయాత్రను అడ్డుకోవడానికి టీ కాంగ్రెస్ లోని ఆయన వ్యతిరేక సీనియర్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.. కొత్త ఇంచార్జ్ మాణిక్ రావు ధాక్రే కూడా రేవంత్ రెడ్డి పాదయాత్రను సమర్థించారు. కాంగ్రెస్ హైకమాండ్ చేప్పిన యాత్ర వేరని… రేవంత్ రెడ్డి చేస్తున్న యాత్ర వేరని…ధాక్రే వద్ద సీనియర్ల తరపున మహేశ్వర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ ధాక్రే మాత్రం కాన్సెప్ట్ ఏదైనా లీడర్లు ప్రజల్లో ఉండటం ముఖ్యమని… మీరు కూడా… ఆసక్తి ఉన్న నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయమని సలహా ఇచ్చేశారు. దీంతో థాక్రే కూడా రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ జాబితాలో చేరిపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
రేవంత్ రెడ్డి పాదయాత్ర సోమవరం ప్రారంభం కానుంది. సీతక్క నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ పాదయాత్రను యాభై, అరవై నియోజకవర్గాల్లో నిర్వహించాలని అనుకుంటున్నారు. కానీ రేవంత్ ప్లాన్ మాత్రం వేరే ఉంది. తెలంగాణ మొత్తం చుట్టేయాలనుకుంటున్నారు. ఎన్నికల నాటికి బలంగా పార్టీని మార్చాలనుకుంటున్నారు. తాము తీసుకొచ్చిన డిక్లరేషన్లను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు అయితే ఆయన విపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలను ఎదుర్కోక తప్పడం లేదు.
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రపై ఆలోచన చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పాదయాత్ర చేసి ఎలా వైఎస్ అధికారంలోకి తెచ్చారో తాను అలా చేయాలనుకుంటున్నారు.
కానీ కాంగ్రెస్ రాజకీయాలు ఆయనకు అడ్డం పడుతూనే వస్తున్నాయి. అప్పట్లో వైఎస్‌కు కూడా ఇలాంటి అడ్డంకులు వచ్చాయి. అదే స్ఫూర్తితో అన్నింటినీ అధిగమించి ఆయన పాదయాత్రకు సిద్ధమయ్యారు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రకు కొనసాగింపుగా రాష్ట్రాల్లో పాదయాత్రలు చేయాలని హైకమాండ్ ఇచ్చిన సూచనలను తన పాదయాత్రకు అనువుగా మల్చుకున్నారు. ఆయనకు మాస్ లో క్రేజ్ ఉండటంతో హైకమాండ్ తరపున వచ్చే ఇంచార్జులుకూడా ఆయన మాటనే సమర్థిస్తున్నారు. దీంతో సీనియర్లకు గర్వభంగం తప్పడం లేదు. ఎప్పట్లాగే సీనియర్లు ధాక్రేపై విమర్శలు చేస్తారా.. లేకపోతే.. సర్దుకుపోతారా అన్నది తేలాల్సి ఉంది.