కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు. ఈ మధ్య కిషన్ రెడ్డి అంతర్గతంగా ఏమైనా రాజకీయం చేయాలని అనుకున్నారేమో కానీ గత వారం రోజులుగా కిషన్ రెడ్డిపై రేవంత్ ఎటాక్ పెరిగిపోయింది. ఆయన కేంద్రమంత్రిగా ఉండి తెలంగాణకు ఒక్కరూపాయి ప్రాజెక్టు తీసుకురాలేదని ఆరోపిస్తున్నారు. అంతే కాదు కేంద్ర కెబినెట్ ముందుకు వచ్చే ప్రతిపాదనల్ని కూడా నిలిపివేయిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆరేళ్లుగా కిషన్ రెడ్డి మంత్రిగా ఉండి తెలంగాణకు తెచ్చిందేమిటో చెప్పాలన్నారు.
తాము మెట్రో విస్తరణ ప్రతిపాదనలు పంపిన తర్వాత .. ఓ రెండు రాష్ట్రాల్లో మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని హైదరాబాద్ గురించి ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. ప్రతిపాదనలు రెడీ అయినప్పటికీ కిషన్ రెడ్డి నిలిపవేయించారన్నది రేవంత్ రెడ్డి ఆరోపణ. నిజంగా అలా జరిగి ఉంటే మాత్రం.. రేవంత్ రెడ్డి కోపానికి ఓ అర్థం ఉన్నట్లే. శుక్రవారం ఉదయమే ఆయన కిషన్ రెడ్డికి భారీ లేఖరాశారు. అందులో తాము ఎన్ని సార్లు ఏఏ అంశాలపై కలిశామో కూడా వివరించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-II, ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్), మూసీ పునరుజ్జీవనం, రీజినల్ రింగ్ రైలు, డ్రైపోర్ట్ వంటి అంశాలపై ప్రధానమంత్రితో పాటు తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్న మీకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం కానీ కనీసం పట్టించుకోవడం లేదన్నారు.
తెలంగాణకు అన్యాయం కిషన్ రెడ్డి వల్లనే జరుగుతోందని మండిపడ్డారు. మూసీకి నిధుల ఇవ్వమంటే ఎందుకంత అసహనమంటూ బీజేపీ నేతల వైఖరిపై సీఎం రేవంత్ మండిపడ్డారు. కేంద్రం ప్రత్యేకంగా తెచ్చిన ప్రాజెక్టు ఒక్కటైనా తెలంగాణలో ఉందా అని ప్రశ్నించారు. దమ్ముంటే ఏపీలో మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేయండని కిషన్ రెడ్డికి సవాల్ చేశారు. కిషన్ రెడ్డిపై రేవంత్ చేస్తున్న ఆరోపణలు సూటిగా ఉండటంతో బీజేపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. తెలంగాణకు ప్రత్చేకంగా ఒక్క ప్రాజెక్టు రాలేదని ఆయన లేఖ రాసిన రోజున సాయంత్రమే ఎయిర్ పోర్టు మంజూరు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది.