తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. నేరుగా జడ్పీ చైర్మన్ పదవినే వదులుకుని నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని రేవంత్ రెడ్డి ఢిల్లీకి తీసుకెళ్లి సోనియాతో సమావేశం ఏర్పాటు చేయించారు. తర్వాత ప్రియాంకా గాంధీతో కండువా కప్పించారు. నిన్నటి వరకూ వారు పార్టీ మారుతారన్న అంశాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచి.. ఉదయమే వారు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత మీడియాకు లీక్ చేశారు. ఎక్కడా పార్టీ మారకుండా టీఆర్ఎస్ నేతలు ఒత్తిడి తేకుండా చూసుకున్నారు.
నల్లాల ఓదెలు ఉద్యమం సమయం నుంచి టీఆర్ఎస్లో ఉన్న నేత. ఆయన రెండు సార్లు చెన్నూరు నుంచి గెలిచారు. ఉద్యమం సమయంలో రాజీనామా కూడా చేశారు. అయితే ఆయనను గత ఎన్నికల్లో పక్కకు తప్పించి అక్కడ కేటీఆర్ సన్నిహితుడు బాల్క సుమన్‌కు సీటిచ్చారు. అప్పట్లో ఈ అంశం పై ఓదెలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఎలాగోలా సర్దుబాటు చేశారు. తర్వాత జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో ఆయన భార్యకు చాన్సిచ్చారు. కానీ బాల్క సుమన్ మాత్రం తమను ఎప్పటికప్పుడు అవమానిస్తున్నారని ఆ దంపతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వారి అసంతృప్తిని కనిపెట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆఫర్‌తో చేర్చుకున్నారు.
ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు అంత గొప్పగా లేవు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నాయకుల్ని పార్టీలో చేర్చడంలో సక్సెస్ అవుతున్నారు. ఓదెలు మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన భార్య జడ్పీ చైర్ పర్సన్ కూడా కాంగ్రెస్‌లో చేరడంతో టీఆర్ఎస్లోనూ ప్రస్తుత పరిణామాలు షాక్‌కు గురి చేసినట్లు అయ్యాయి.