తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సూటిగా, సుత్తిలేకుండా కేసీఆర్ కుటుంబానికి భయం పుట్టించే కామెంట్లు చేశారు. బడ్జెట్ పై చర్చలో కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలో కక్ష సాధింపుల పాలన అన్నారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అందుకున్నారు. నిజంగా తాను కక్ష సాధించాలని అనుకుంటే కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైల్లో ఉండేవారని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్ హయాంలో తనపై ఎలా వ్యవహరించారో..తనను కక్ష పూరితంగా ఎలా జైల్లో పెట్టారో వివరించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
జన్వాడ ఫామ్ హౌస్‌పై డ్రోన్ ఎగురవేసిన కేసును రేవంత్ గుర్తు చేసుకున్నారు. మామూలుగా అయితే డ్రోన్ ఎగురవేసిన కేసులో స్టేషన్‌న బెయిల్ ఇస్తారన్నారు. ఆ కేసుకు శిక్ష ఐదు వందల రూపాయల జరిమానా అని కానీ .. తనను అరెస్టు చేసి పదహారు రోజుల పాటు నక్సలైట్లు, తీవ్రవాదులను పెట్టే డిటెన్షన్ సెంటర్ లో పెట్టారన్నారు. ఎవర్నీ కలవనివ్వలేదన్నారు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి.. తనను అలా హింసించారని గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో తన కుమార్తె పెళ్లికి కూడా వెళ్లనీయకుండా చేసేందుకు ఢిల్లీలో ఉన్న లాయర్లను భారీగా ఖర్చు పెట్టి తీసుకొచ్చి వాదించారన్నారు. అలాంటి బాధలు పడిన తాను కక్ష తీర్చుకోవాలనుకుంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
ప్రజల్నిచ్చిన అధికారాన్ని కక్ష సాధింపుల కోసం ఉపయోగించకూడదనే సంయమనం పాటిస్తున్నానన్నారు. పార్టీ ఆఫీసుల్లో మనుషుల్ని పెట్టి ఇష్టం వచ్చినట్లుగా తనను ..తన కుటుంబాన్ని తిట్టిస్తున్నా సరే విజ్ఞత పాటిస్తున్నానన్నారు. ఎన్నికల సమయంలో తాను చర్లపల్లిలో కేసీఆర్ కుటుంబం కోసం డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చానని..దాన్ని కూడా నెరవేర్చలేదని రేవంత్ కౌంటర్ ఇచ్చారు. దేవుడు ఉన్నాడని ఊరుకున్నానని తాను ప్రమాణ స్వీకారం రోజే ఆస్పత్రిలో చేరారని కేసీఆర్ తుంటి విరగడాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
రేవంత్ ప్రసంగంలో.. తనను ఎన్ని బాధలు పెట్టారో గుర్తున్నాయని.. ఇప్పుడు తన చేతిలో అధికారం ఉన్నా సరే తాను అలాంటి కక్ష సాధింపుల జోలికి వెళ్లడం లేదని.. వెళ్లదల్చుకుంటే ఏమవుతుందో కూడా ఆయన గుర్తు చేసినట్లయింది.