తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కాస్త కరిజ్మా ఉన్న నాయకుడు ఎవరంటే… రేవంత్ రెడ్డి అని చెప్పాలి. అయితే, ఆయన వ్యవహార శైలి పార్టీలో కొంతమందికి నచ్చడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. పార్టీ సీనియర్లతో సంబంధం లేకుండా సొంత అజెండాల ప్రకారం ప్రజా పోరాటాలు, ధర్నాలు లాంటి కార్యక్రమాలు రేవంత్ చేపట్టేస్తుంటారనీ.. ఇతర దేశం నేతల్ని కలగలుపుకునే తత్వం రేవంత్‌కు లేదనే అభిప్రాయం ఉంది. తెలుగుదేశం పార్టీ కంటే సొంతగా తన ఇమేజ్ను పెంచుకునే దిశగా రేవంత్ ఉన్నారని కూడా అనేవారూ లేకపోలేదు. అయితే, ఈ విషయాలన్నీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేరకుండా ఉంటాయా..? ఆయనకు తెలియకుండా ఉంటాయా..? మొత్తానికి ఎక్కడ ఏది పనిచేసిందో తెలీదుగానీ… రేవంత్ తీరు కొంత మారినట్టుగా ఉందని చెప్పుకోవాలి.
ఆయన ఎవ్వరినీ కలుపుకోరు అనే ఇమేజ్ను మార్చుకునేందుకు రేవంత్ సిద్ధమైనట్టున్నారు. ఈ మధ్య పార్టీ తరఫున ఏ చిన్న కార్యక్రమం చేపట్టాలన్నా ఇతర నాయకుల సలహాలు తీసుకుంటున్నారట. కోదండరామ్ చేసిన దీక్షకు సంఘీభావం తెలపడం, ఫిరాయింపులపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం, భూసేకరణ బిల్లు.. ఇలాంటి కీలక అంశాలపై మాట్లాడే ముందు ఇతర నేతల సలహాల్ని రేవంత్ తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ కాస్త దూకుడు తగ్గించుకోవాలని పార్టీ సీనియర్లే చెప్పడంతో… అసెంబ్లీలో కూడా తనదైన సహజ సిద్ధ దూకుడు ధోరణిని కొంత మేరకు రేవంత్ మార్చుకున్నారని పార్టీ వర్గాలే అంటున్నాయి.
పార్టీలో ఒంటెద్దు పోకడలు పోతున్నారన్న ఇమేజ్ను మార్చుకుంటున్నట్టుగా చెప్పుకోవాలి. అయితే, ఈ మార్పు ద్వారా రేవంత్ తగ్గారని చెప్పుకోవడానికి వీల్లేదు! పార్టీపై మరింత పట్టు సాధించే దిశగా ఇది ఒక వ్యూహాత్మక ఎత్తుగడ అని కూడా చెప్పుకోవచ్చు. పార్టీలో అన్ని వర్గాలనూ కలుపుకుని పోవడం ద్వారా కలిసి వచ్చేది రేవంత్‌కే. తన సహజ శైలిలో కాస్త మార్పుతో రెండు పనులు ఒకేసారి నెరవేర్చుకుంటున్నారు. ఒకటీ.. పార్టీలో అందరికీ దగ్గర కావడం ద్వారా తనకు మద్దతు పెంచుకోవడం, రేవంత్ సొంతంగా వ్యవహరిస్తారన్న అపవాదును దూరం చేసుకోవడం!
వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పుంజుకుంటుందని ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు చెప్పి వెళ్లారు. తెలంగాణలో పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయనీ, ఒక బలమైన నాయకుడు కావాలని, భాజపాకి నరేంద్ర మోడీ మాదిరిగా టీటీడీపీలో అన్నీ తానై బాధ్యతలు భుజాన వేసుకునే నేత ఉంటే అదరగొడుతుందని అన్నారు. మరి, చంద్రబాబుకు దొరికిన తెలంగాణ మోడీ ఈయనేనా..!