కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసంతృప్తిని గుర్తించిన రేవంత్ రెడ్డి వారితో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం గురువారం సమయం కేటాయించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేపు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారు. ఎమ్మెల్యేలను నాలుగు గ్రూపులుగా చేసి వారి సమస్యలపై చర్చిస్తారు. రేపు జరిగే మీటింగ్ మా కాంగ్రెస్ కుటుంబ మీటింగ్ అని.. అన్ని మాట్లాడుకుంటాం అన్నీ సెటిల్ చేసుకుంటాం టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.
గత వారం జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి ఇంట్లో పది మంది వరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ క్రమంలో వారి భేటీ కలకలం రేపింది. చివరికి వాారు పొంగులేటిపై అసంతృప్తితో సమావేశమయ్యారన్న ప్రచారం జరిగింది. చివరికి ఈ విషయంలో దీపాదాస్ మున్షి జోక్యం చేసుకున్నారు. అసలేం జరిగిందో తెలుసుకున్నారు. విడిగా అసంతృప్త ఎమ్మెల్యేలతో కాకుండా అందరితోనూ సమస్యల గురించి చర్చించడం మంచిదని నిర్ణయించుకున్నారు.
ప్రభుత్వం ఏర్పడినా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనులు కావడం లేదన్న అసంతృప్తిలో ఉన్నారు. కొంత మంది బడా కాంట్రాక్టర్లు అయిన నేతలే అన్నీ తీసుకుంటున్నారని..చివరికి తాము సిఫారసు చేసిన అధికారుల్ని కూడడా నియమించడం లేదని ఆవేదనకు గురి అవుతున్నారు. ఈ క్రమంలో ఎవరికి వారు మథనపడుతూ.. ఓ గ్రూపుగా మారుతున్నారు. అనిరుథ్ రెడ్డి పది మందిని పోగు చేయడంతో ఆయనపై అందరి దృష్టి పడింది. ఇప్పుడు అందర్నీ కూల్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.