దాదాపు మూడు రోజులుగా నానా యాగీ. మొత్తం మీడియా అంతా అతడే సెంట్రాఫ్ అట్రాక్షన్. అదిగో పార్టీ మారుతున్నాడు. ఇదిగో వీరిని పట్టుకుపోతున్నాడు. అదిగో ఎపి టీడీపి నేతల స్కామ్‌ల చిట్టా విప్పాడు. ఇదిగో ఇంకొందరి జాతకాలు చెప్పబోతున్నాడు. అంటూ టీవీ గొట్టాలన్నీ ఆయన వెనకాలే గిరగిరా తిరిగాయి. అంతెందుకు… కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ సైతం అవును రేవంత్ మా పార్టీలోకి వచ్చేస్తున్నాడు అంటూ చెప్పేశాడు. అయితే.. అందర్నీ వెర్రివెంగళాయిల్నిచేసినట్టు అంతా తూచ్ అన్నట్టు ఒక్కసారిగా షాకిచ్చాడు రేవంత్‌రెడ్డి.
ఆదివారం కొడంగల్‌లో కార్యకర్తలసమావేశంలో మాట్లాడిన రేవంత్…తాను పార్టీ మారతున్నట్టు ఎవరికీ చెప్పలేదంటూ, పొత్తుల గురించి మాట్లాడే సమయం ఇది కాదన్నాడు. ఈ నెల 26న జరిగే టీడీపీ పోలిట్‌బ్యూరో సమావేశానికి తాను హాజరవుతున్నట్టు వెల్లడించాడు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దు అంటూ భరోసా ఇచ్చాడు. అంతేకాదు… విదేశీ పర్యటన నుంచి వచ్చిన అనంతరం చంద్రబాబుతో సమావేశమవుతానని, ఆయన చెప్పిన మేరకు తాను నడచుకుంటానని రేవంత్ అనడంతో మీడియా బుర్ర మొత్తం ఒక్కసారిగా గిర్రున తిరిగింది. దీంతో మళ్లీ రేవంత్ ఎపిసోడ్లో మీడియా యూటర్న్ తీసుకోవడం మొదలెట్టింది.
అయితే… కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ వెళ్లడం లేదా? రేవంత్-రాహుల్ సమావేశం ఒట్టిదేనా? ఎపి మంత్రుల మీద రేవంత్ చేసిన కామెంట్లు ఆవేశంలోనో అనాలోచితంగానో మాత్రమే చేసినవా… అంటే మాత్రం రాజకీయ విశ్లేషకులు కాదనే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న రేవంత్, రాహుల్ ని కలిసిన మాట నిజమేనని కొందరు రాజకీయ పండితులు ధ్రవీకరిస్తున్నారు. అయితే రేవంత్ పట్టుకొచ్చిన నేతల చిట్టా ప్రకారం టిక్కెట్లపై రాహుల్ ఎటువంటి హామీ ఇవ్వలేదననేది వీరిస్తున్న సమాచారం. మరోసారి చర్చ అనే హామీతో తిరిగొచ్చిన రేవంత్… స్వరాష్ట్రంలో తను పార్టీ మారడం అంశంపై రగిలిన వేడిని ఉపయోగించుకోవడానికి కావాలనే దాన్నిమరింత రగిల్చాడని అంటున్నారు. దీని ద్వారా తన పాప్యులారిటీని తెలియజెప్పడంతో పాటు, అటు తెదేపాని, ఇటు కాంగ్రెస్‌ని అయోమయంలో పడేయడం కూడా ఆయన వ్యూహమని తేల్చేస్తున్నారు.
ఈ రోజు కాకపోయినా రేపైనా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేరిక దాదాపు ఖాయమైనట్టేనంటున్న ఈ వర్గాలు… అయితే దీన్ని వీలైనంత కాలం పాటు నాన్చి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నాడని అంటున్నాయి. .ఏదేమైనా… ఇప్పటిదాకా చప్పగా ఉన్న తెలంగాణ రాజకీయాల్ని ఒక్కసారిగా మాంఛి స్పైసీ గా మార్చి, మీడియాకు బోలెడంత మషాలా అందించినందుకు మాత్రం రేవంత్‌ను మెచ్చుకోవాలి..