హైదరాబాద్: హైకోర్ట్ ఆంక్షలు సడలించటంతో తెలుగుదేశం తెలంగాణ నేత రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ నగరంలో ప్రవేశించారు. కొడంగల్‌నుంచి వచ్చిన రేవంత్‌కు తెలుగుదేశం కార్యకర్తలు ఎల్బీ నగర్‌వద్ద ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొందరు కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి రేవంత్ టీడీపీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఆ తర్వాత అక్కడవారినుద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణలో ఆట మొదలయిందని కేసీఆర్ అన్నారని, ప్రారంభమయింది ఆట కాదని, వేట మొదలయిందని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తానని కేసీఆర్ అన్నారని, రాత్రి తాగితే తెల్లారేసరికి ఖాళీ అవటానికి తమ పార్టీ ఏమీ మద్యం సీసా కాదని చెప్పారు. సింహం సింగిల్‌గా హైదరాబాద్ వస్తుందని తెలుసుకున్న కేసీఆర్, ప్రత్యేక విమానం వేసుకుని చైనా పారిపోయాడని పలు పంచ్ డైలాగులు వేశారు.
బంగారు తెలంగాణను తీసుకొస్తానని ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్ – రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. కేసీఆర్‌కు మందులో సోడా పోసే మంత్రి తరహా నేతను కాదని, త్వరలో కేసీఆర్ అంతు చూస్తానని ధ్వజమెత్తారు. సీఎమ్‌కు ఫామ్‌హౌస్‌పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని అన్నారు. పెట్టుబడులు తీసుకురావటానికి చైనా వెళ్ళిన కేసీఆర్, తనకు తాబేదార్లుగా పనిచేసేవారినే వెంట తీసుకెళ్ళారని ఆరోపించారు. ఆర్థికమంత్రిని ఎందుకు తీసుకెళ్ళలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవాళ ట్యాంక్‌బండ్ వద్ద ఒక ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు లింబయ్య కుటంబ సభ్యులను రేవంత్ గాంధీ ఆసుపత్రిలో పరామర్శించి రు.50 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఏది ఏమైనా రేవంత్ పంచ్ డైలాగులు మాత్రం ఓవర్‌గా అనిపిస్తోందనటంలో సందేహంలేదు.