“సెంచరీలు కొట్టేవాళ్లను క్రీజ్‌లోకి పంపి.. గెలుపు కోసం ప్రయత్నించాలి కానీ..పెవిలియన్‌లో కూర్చొబెడితే.. గెలుపు ఎలా వస్తుంద”ని.. కొద్ది రోజుల కిందట.. కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కని విషయాన్ని గురించి అఫ్ ది రికార్డ్‌గా మాట్లాడుతూ రేవంత్ చేసి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ విషయంలో తనను తాను స్టార్ ప్లేయర్‌గా.. మ్యాచ్ విన్నర్‌గా రేవంత్ రెడ్డి పోల్చుకున్నారు. అది ఆయన ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు.. నిఖార్సైన నిజం కూడా. తెలంగాణలో ఇప్పటికిప్పుడు.. కేసీఆర్‌కు పోటీ పడగల నేత ఎవరూ.. అని చర్చ పెడితే.. ఒకటి నుంచి పదో స్థానం వరకూ రేవంత్ రెడ్డి మాత్రమే ఉంటారు. ఎప్పటికైనా.. కేసీఆర్ అనే నాయకత్వానికి సవాల్ విసిరేతి రేవంత్ రెడ్డేనని.. చాలా కాలంగా తెలంగాణలో ప్రచారం జరుగుతోంది.
ఓటుకు నోటు కేసు విషయంలో రేవంత్ రెడ్డి జైలుకు పోయి ఉండవచ్చు కానీ.. ఆయన ఇమేజ్ మాత్రం అమాంతం పెరిగింది. ఆ సమయంలో రేవంత్ రెడ్డికి వచ్చిన సపోర్ట్ అంతా ఇంతా కాదు. ఆయనపై కుట్ర జరిగిందని.. ఒక్క టీఆర్ఎస్ నేతలు తప్ప.. అందరూ నమ్మారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు… ఏమీ ప్రయోజనాలు ఆశించకుండానే పార్టీ మారిపోయారా..? రేవంత్ రెడ్డి మాత్రమే.. ఓట్లు కొన్నాడా..? అని సగటు తటస్థ ఓటర్ కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్‌గా నిలిచారు. పైగా.. కేసులు, సెక్షన్లు, కేమెరాలతో షూటింగ్ అంతా పక్కా ట్రాప్ అన్న విషయం బయటకు తెలియడానికి ఎక్కువ కాలం పట్టలేదు. అరెస్టయినప్పుడు.. తొడకొట్టి.. కేసీఆర్‌ను జైలుకు పంపుతానని చాలెంజ్ చేయడం.. ఆయనకో గుర్తింపు తీసుకొచ్చి పెట్టింది. ఈ విషయం.. ఆయన బెయిల్ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు స్పష్టమయింది.
అప్పట్లో ఎన్నికల నాటికి.. రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా రాజకీయం మారిపోతుందని.. అందరూ అనుకున్నారు. అప్పటి వరకూ.. చాలా ఉద్ధృతంగా.. కేసీఆర్‌పై విమర్శల బ్యాటింగ్ చేసిన రేవంత్‌కు ఆ తర్వాత అనూహ్యంగా మీడియా సపోర్ట్ కూడా తగ్గిపోయింది. అయినా ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. కానీ.. కానీ.. ఏ ఉద్దేశంతో తీసుకున్నారో కానీ.. కాంగ్రెస్ పార్టీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ఏకీకరణ సాధిస్తేనే.. కేసీఆర్‌పై పోరాటం సాధ్యమని.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకు ముందు ఆయన చాలా ప్రణాళికలు వేసుకున్నారు. పాదయాత్ర దగ్గర్నుంచి.. ప్రజల్లోకి ఎలా వెళ్లాలో అనేక ప్రణాళికలు వేసుకున్నారు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పట్నుంచి.. సాదాసీదా లీడర్ అయిపోయారు. ప్రచార కార్యదర్శి పదవి అని.. వర్కింగ్ ప్రెసిడెంట్ అని చాలా చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఎన్నికల వాతారవణం పీక్స్‌కి చేరినా ఎలాంటి పదవీ రాలేదు.
ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వచ్చినా.. కొన్ని విమర్శలు చేస్తున్నా… మునుపటి ఫామ్ మాత్రం లేదు. దానికి కారణం ఆయన మెడలో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ జెండానే కావొచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఏ హోదాతో మాట్లాడుతున్నారన్న విమర్శలు.. ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తున్నాయి. మొన్నటికి మొన్న ఎన్నికల సన్నాహాలపై.. సమావేశం ఏర్పాటు చేసి .. రేవంత్‌ను పిలిస్తే.. ఆయనకు ఏ పదవీ లేదు.. ఎందుకు పిలిచారని.. కొంత మంది లొల్లి చేశారు. కాంగ్రెస్‌లో అలాగే ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే.. మ్యాచ్ ప్రారంభమైపోయింది. కాంగ్రెస్ పార్టీ అంతకంతకూ వెనుకబడిపోతోంది. కానీ మ్యాచ్ విన్నర్ ను చేతిలో పెట్టుకుని.. టైం పాస్ చేస్తోంది. దీని వల్ల కాంగ్రెస్‌కు పోయేదేమీలేదు. మరో సారి ఓడిపోతుంది. కానీ.. రేవంత్ మాత్రం.. వెనక్కి తిరిగి తెచ్చుకోలేని అవకాశాల్ని కోల్పోతున్నారు.