తెలంగాణలో ఉపఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని సీఎం రేవంత్ కొట్టి పారేశారు. గతంలో రాని ఉపఎన్నికలు ఇప్పుడు ఎలా వస్తాయని ప్రశ్నించారు. పార్టీ మారిన వాళ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఉప ఎన్నికలు రాలేదని.. గతంలోనే రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని అసెంబ్లీలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. గతంలో ఆచరించిన సంప్రదాయాలనే ఇప్పుడు మనం ఆచరిస్తున్నామని ..సభ్యులెవరూ ఆందోళన చెందొద్దని పార్టీ మారిన వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
పది మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని బీఆర్ెస్ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. మంగళవారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్కాఖ్యలు చేసింది. సభ్యుల రాజీనామాలు లేదా అనర్హతా వేటు అంశంలో స్పీకర్ కు నిర్దిష్టమైన గడవు విషయంలో గతంలో రాజ్యాంగ ధర్మాసనాలు తీర్పులు ఇచ్చాయని వాటిని కాదని తామెలా తీర్పు ఇవ్వగలమని ప్రశ్నించింది. అదే సమయంలో దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయడంతో ఇలాంటి ఫిరాయింపుల విషయంలో ఏదో ఒకటి చేయాల్సిందేనన్న అభిప్రాయాన్ని న్యాయమూర్తి వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది తాము పార్టీ ఫిరాయించలేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు విషయంలో అనర్హత వేటు వేసే అధికారం ఒక్క స్పీకర్ కే ఉంటుంది. అయితే దానం విషయంలో మాత్రం.. ఆయనను కాపాడుకోవడం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది.