గోపనపల్లి భూ అక్రమ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మీద మళ్లీ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే అంశమై ఆయన పట్నం గోస కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. తనపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే కొత్త కాదు, ఇదే చివరిదీ కాదన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను వెలికితీసినప్పుడల్లా, కొత్త కొత్త కథల్ని ప్రభుత్వం వెలికితీస్తుందన్నారు. ప్రభుత్వం వారిదే, పోలీసులు వారిచేతిలోఉన్నారు, సమగ్ర దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకోవచ్చు.. ఎవరొద్దన్నారు అన్నారు.
ఉన్న ఆస్తి మొత్తం పోయినా, కొన ఊపిరి వరకూ కేసీఆర్ కి వ్యతిరేకంగానే పోరాడుతూనే ఉంటా అన్నారు రేవంత్. 2005లో తాను ఆస్తులు కొనుక్కుంటే, 1978లో రికార్డులు తాను తారుమారు చేశానని అంటున్నారనీ, ఇలాంటి ఆరోపణ చేసేముందు కనీస జ్ఞానం ఉండాలన్నారు. ప్రభుత్వం ఏం చేసినా న్యాయ స్థానాలు ఉండనే ఉన్నాయనీ, తనపై ఇప్పటికే 65 కేసులు పెట్టారనీ, ఎన్నికల సందర్భంలో కొడంగల్ లో తన ఇంట్లో ఉంటే అర్ధరాత్రి వచ్చి ఎత్తుకుపోయారనీ, ఆ సమయంలో కోర్టును ఆశ్రయిస్తే డీజీపీని కోర్టు బండబూతులు తిట్టింది కదా అని గుర్తుచేశారు. గోపనపల్లిలో జరుగుతున్న తతంగానికి భయపడేది లేదనీ, తాను పట్నం గోస మొదలుపెట్టగానే వాళ్లు ఆ పని మొదలుపెట్టారంటే… ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు బయల్దేరగానే గోపనపల్లి భూములు గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు.
ఇదీ ఒకరకంగా తనకు మంచిదేననీ, ఢిల్లీ నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయన్నారు. బాగానే కొట్లాడుతున్నట్టున్నావ్, అందుకే కేసీఆర్ మళ్లీ కేసులు పెడుతున్నాడని అంటున్నారన్నారు. కొట్లాడినప్పుడల్లా కేసీఆర్ పెట్టే కేసులు తనకు సర్టిఫికేట్లు లాంటివన్నారు రేవంత్. ప్రజల దగ్గరకి వెళ్తే కేసీఆర్ పెట్టే కేసులు తనకు దక్కే మెడల్స్ అన్నారు. మొత్తానికి, గోపనపల్లి ఆరోపణల్ని తనకు సానుకూలంగా మార్చుకునే వ్యాఖ్యలు చేశారు రేవంత్. పట్నం గోస యాత్ర చేస్తున్న సమయంలో ఇది మరోసారి వెలుగులోకి రావడాన్ని కేసీఆర్ రాజకీయ కక్ష సాధింపు ధోరణి అనే అభిప్రాయాన్నే కలిగించే ప్రయత్నం రేవంత్ చేస్తున్నారు.