తెదేపాను వచ్చే ఎన్నికలలోగా చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా విస్తరించాలనే ఉద్దేశ్యంతోనే పార్టీలో జాతీయ కమిటీని ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్షుడుగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. కానీ తెలంగాణాలో చాలా బలంగా ఉన్న తెదేపాకే ఆయన క్రమంగా దూరం అవుతుండటం కూడా అందరూ గమనిస్తూనే ఉన్నారు. పార్టీ ఎంతో బలంగా ఉన్న తెలంగాణాలోనే నిలద్రొక్కుకోలేనప్పుడు ఇక అసలు పార్టీ ఉనికే లేని వేరే రాష్ట్రాలకు ఏవిధంగా విస్తరిస్తారనే సందేహం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాదిలో జరిగిన కొన్ని సంఘటనల తరువాత ఆయన విజయవాడకు తరలిపోవడం, ఆ తరువాత అంతవరకు కత్తులు దూసుకొన్న ఆంధ్రా, తెలంగాణా ముఖ్యమంత్రులు చాలా నాటకీయంగా జిగిరీ దోస్తులు అయిపోవడం వంటివి అందరూ చూసారు. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు తెలంగాణా రాజకీయాలకు, తెలంగాణాలో తన స్వంత పార్టీకి కూడా దూరం అయిపోతున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో స్నేహం కోసమే పార్టీని బలిపెట్టుకొంటున్నట్లుగా కనిపిస్తోంది. కానీ ఆయనకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చక్కబెట్టడం కోసమే సమయం సరిపోవడం లేదని అందుకే తెలంగాణాలో పార్టీ వ్యవహారాలపై మునుపటిలాగ ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారని ఆ పార్టీ తెలంగాణా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పారు.
శుభకార్యాలలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసినంత మాత్రాన్న వారిరువురూ జిగిరీ దోస్తులు అయిపోయినట్లు కాదని అభిప్రాయం వ్యక్తం చేసారు. “తెలంగాణాలో తెదేపాను కాపాడుకోవడం కోసం తమ రక్తం కూడా ధారపోసిన వాళ్ళు ఎందరో ఉన్నారని, వారి త్యాగాల ఫలితంగానే పార్టీలో నుంచి చాలా మంది బయటకి వెళ్లిపోయినప్పటికీ నేటికీ తెలంగాణాలో పార్టీ బలంగా ఉంది. అటువంటి పార్టీని కేసీఆర్ తో స్నేహం కోసం చంద్రబాబు నాయుడు బలి చేసుకొంటారనుకోవడం అవివేకం. ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలతో సమయం చిక్కకపోవడం వలననే తెలంగాణాలో పార్టీకి సమయం కేటాయించలేకపోతున్నారు,” అని రేవంత్ రెడ్డి అన్నారు.
రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుని వెనకేసుకువస్తున్నట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ, కేసీఆర్ తో స్నేహం కోసం పార్టీని బలి చేసుకోవద్దని చంద్రబాబు నాయుడుని సున్నితంగా హెచ్చరిస్తున్నట్లుంది. అలాగే కేసీఆర్ తో స్నేహాన్ని శుభకార్యాలవరకే పరిమితం చేసి, తెలంగాణాలో పార్టీని పట్టించుకోవాలని హితవు చెపుతున్నట్లుంది. రేవంత్ రెడ్డి చాలా సున్నితంగా చేస్తున్న ఈ హెచ్చరికలను చంద్రబాబు నాయుడు పట్టించుకొంటారో లేదో వేచి చూడాలి.