హరీష్ రావు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో సంప్రదింపులు జరిపినందునే… కేసీఆర్ ఆయనను దూరం పెడుతున్నారని… కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి మీడియాతో వ్యాఖ్యానించారు. మీడియాతో రెండేళ్ల పాటు నేరుగా మాట్లాడబోనని గతంలో ప్రకటించిన రేవంత్ … అప్పుడప్పుడు మాత్రం చిట్ చాట్ గా మాట్లాడుతున్నారు. హరీష్ రావు అమిత్ షా తో రహస్యంగా మాట్లాడారని… ఆ ఫోన్ రికార్డ్ లను హరీష్ రావు పిఏ స్వయంగా కేసీఆర్ కు ఇచ్చారని… ఇది హరీష్ కు మంత్రిపదవి ఇవ్వకపోవడానికి కారణమని రేవంత్ చెబుతున్నారు. తోటపల్లి, గౌరారం రిజర్వాయర్ల కాంట్రాక్టుల్లో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని.. రేవంత్ చెప్పారు. హరీష్‌రావు రూ. 600 కోట్లు వెనకేసుకుని …ఆ డబ్బులను మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు పంచారన్నారు.
30 మందికి హరీష్‌రావు ఎన్నికల నిధులు ఇచ్చినట్లు.. కేసీఆర్‌కు ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ కారణాలన్నింటితోనే… ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం లేదని.. విశ్లేషిస్తున్నారు. కడియం, నాయినిపై ఒక్క అవినీతి మచ్చ లేదని.. అయినా వారికి ఎందుకు మంత్రి పదవులు ఇవ్వడం లేదని రేవంత్ ప్రశ్నిస్తున్నారు. హరీష్‌రావుపై సానుభూతి ఉంది…మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నారని.. కేటీఆర్ కంటే హరీష్‌రావు అర్హుడుని చెప్పుకొచ్చారు. ఓటుకు నోటుకు కేసులో మళ్లీ తనకు ఈడీ నోటీసులు జారీ చేయడంపైనా రాజకీయ కుట్ర ఉందని.. రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కేసీఆర్, మోదీ ఒక్కటయ్యారు కాబట్టే తన మీద ఈడీ కేసు మోదయిందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రూ. 150 కోట్లు సీజ్ చేశారు … అందరి మీదా ఈడీ కేసు పెట్టారా అని ప్రశ్నిస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి దగ్గర రూ. 50 లక్షలు దొరికాయి .. ఆయనపై ఈడీ కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు.
తన మీద చార్జ్‌షీట్ వేసిన తర్వాత మళ్ళీ ఈడీకి ఎందుకు అప్పగించారని.. కేవలం రాజకీయంగా వేధించడానికే ఈడీ కేసని రేవంత్ తేల్చి చెప్పారు. తాను ప్రజలు ఓట్లు వేసినప్పుడు నేను గెలిచిన, పోలీస్ లతో బలవంతంగా ఓట్లు వేయించుకున్న రు కాబట్టి ఓడిపోయానని విశ్లేషించారు. రాజకీయ పోరాటాలకు తాను దూరం అవలేదని స్పష్టం చేశారు. వారం రోజుల్లో ఎర్రజొన్న రైతుల సమస్యలు పరిష్కరించాలని లేదంటే రైతుల పక్షాన ఆందోళన చేస్తామని హెచ్చరించారు.