కేసీఆర్ ని పాలక పక్షం నుంచి దించుతామనే నమ్మకం తనకు నూటికి నూరు శాతం ఉందన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. ప్రతిపక్షంగా ఆయనే ఉండబోతున్నారనీ, విపక్ష నేతగానైనా క్రియాశీలక పాత్ర పోషించాలంటే ఇప్పటికైనా కేసీఆర్ తీరు మార్చుకోవాలన్నారు. ఆయనకి కొంత నాలెడ్జ్ ఉందనీ, గేట్లు తెరిచి వినడం మొదలుపెట్టాలనీ, కేసులు పెట్టుడు, లోపలేసుడు.. ఈ సమయాన్ని కొంత తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కి ఇప్పుడే కాదు, మొదట్నుంచీ వినే స్వభావం లేదన్నారు రేవంత్ రెడ్డి.
రకరకాల కారణాల వల్ల ఒక గొప్ప అవకాశం కేసీఆర్ కి వచ్చిందనీ, కానీ గడచిన నాలుగున్నరేళ్లు పాలనపై దృష్టి పెట్టడం మానేసి, పార్టీ ఫిరాయింపులూ రాజకీయ కక్ష సాధింపు చర్యలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు అన్నారు. గడచిన నాలుగున్నరేళ్లలో ఆయన చేసిందేదీ ఇప్పుడు అక్కరకు రావడం లేదన్నారు. తన వ్యక్తులను కాకుండా, బయట వ్యక్తులను కూడా కలుస్తూ ఉంటే కేసీఆర్ కి మరింత పరిధి పెరిగేదన్నారు. నాలుగు గోడల మధ్య కేవలం తన వారితోనే కూర్చోవడం వల్ల బయట ప్రపంచంతో కేసీఆర్ కి కనెక్షన్ తెగిపోయిందన్నారు. టీడీపీలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన శాఖకే పరిమితం, బయటకి వచ్చాక ఉద్యమాలంటూ అప్పుడప్పుడూ మీటింగులకు మాత్రమే పరిమితమయ్యేవారన్నారు. అయితే, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తన పాత్ర మారిపోయిందని ఆయన గుర్తించలేదన్నారు.
ఆ పాత్ర సరిగా పోషించకపోవడం వల్లనే తామేం మాట్లాడినా అసహనానికి గురౌతున్నారనీ, వినే లక్షణం ఆయనకి ఎప్పుడూ లేదన్నారు. తనకు నచ్చకపోతే ఠక్కున మీద పడిపోయి దబదబా కొట్టేసి పారిపోవడమనే గెరిల్లా యుద్ధం అప్పుడు కరెక్టేననీ, ఇప్పుడు కేసీఆర్ ప్రజల్లో ఉన్నారు కాబట్టి తలుపు తెరవాలన్నారు. ప్రజల గొంతు వినేందుకు సమయం ఇస్తే.. చాలా సమస్యలు వేగంగా పరిష్కారమౌతాయనీ, ఆ అవకాశం కేసీఆర్ ఇవ్వలేదన్నారు. ప్రగతి భవన్ గేట్లు తెరిచి ప్రజలను, ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను లోపలికి రానిచ్చి చర్చ చేయడం మొదలుపెడితే తెలంగాణకి మేలు జరుగుతుందన్నారు రేవంత్. కేసీఆర్ ను ఎప్పుడూ విమర్శించే రేవంత్ రెడ్డి.. ఆయన గురించి ఇంత విశ్లేషణాత్మకంగా మాట్లాడటం ప్రత్యేకంగానే కనిపిస్తోంది. కేసీఆర్ తీరులో లోపాన్ని బాగానే ఎత్తి చూపారని చెప్పొచ్చు.