తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ ఓ కొత్త విషయాన్ని తెరపైకి తెస్తారు. అలా బాలల దినోత్సవం రోజున ఆయన పిల్లల కోసం మాక్ అసెంబ్లీ నిర్వహింప చేశారు. దానికి స్వయంగా హాజరయ్యారు. ఆ అసెంబ్లీలో ఆయన తనపై పొగడ్తల్నే కాదు… విమర్శల్ని కూడా ఆహ్వానించారు. అది ఆయన ప్రజాస్వామ్య స్ఫూర్తి అనుకోవచ్చు. అయితే ఆ తర్వాత ప్రసంగంలో పిల్లల్ని ఎమ్మెల్యేలుగా చేస్తానని ప్రకటించేశారు. పద్దెనిమిదేళ్లకే ఓటు హక్కు వచ్చినప్పుడు పోటీ చేయడానికి పాతికేళ్ల దాకాఎందుకు అని రేవంత్ ప్రశ్న. ఓటు వేయడానికి వచ్చిన హక్కు వయసుకే పోటీ చేసే చాన్సివ్వాలని అడగలేదు కానీ ఇరవై ఒక్క ఏళ్ల కు పోటీ చేసే చాన్సివ్వాలని రేవంత్ అంటున్నారు.. ఈ మేరకు అసెంబ్లీలోతీర్మానం చేసి కేంద్రానికి పంపుతామంటున్నారు.
ఇప్పుడు అసలు పోటీ చేసే వయసు పెద్ద మ్యాటర్ కాదు. రాజకీయాల్లో లీడర్లకు రిటైర్మెంట్ అనేది లేకపోవడం వల్ల యువత రావాలంటే చాలా కష్టమవుతోంది. సీనియర్ నేతలు తమకు ఎనభై, తొంభై ఏళ్లు వచ్చేదాకా వదిలి పెట్టడం లేదు. వారి తర్వాత వారి వారసులు వస్తున్నారు. నిఖార్సుగా దిగువ నుంచి పని చేసుకుని రాజకీయాల్లో ఎదిగేవారు చాలా తక్కువ. అలా ఎదిగినా… ఎప్పటికి చాన్స్ వస్తుందో అంచనా వేయడం కష్టం. అంత ఎందుకు కాంగ్రెస్లో యంగెస్ట్ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి చాన్స్ ఎలా వచ్చింది.. ఆమె అత్తకు ఇవ్వాలనుకున్న టిక్కెట్ .. పౌరసత్వ సమస్య కారణంగా ఇవ్వలేకపోతే కోడలికి ఇచ్చారు. అంతే తప్ప పనితీరు చూసి కాదు.
ప్రస్తుత రోజుల్లో ఇరవై ఒక్క ఏళ్లకు యువత పండిపోదు. రాజ్యాంగంలోని కనీస విషయాలపైనా అవగాహన పెంచుకోలేరు. ఇంకా చెప్పాలంటే ఓ ప్రజాప్రతినిధి అవ్వాలంటే అన్ని విషయాలపై అవగాహన ఉండాలి. అందుకే పోటీ చేసే వయసును పాతిక నుంచి ముఫ్పైకి పెంచినా అభ్యర్థుల కొరత రాదు. కానీ ఇలా వయసును తగ్గించడం వల్ల రాజకీయనేతల వారసులకు మాత్రం ఓ అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఆసక్తిగా రాజకీయాల్లోకి రావాలనుకున్న ఏ ఒక్కరికీ ఈ మార్పు ఉపయోగపడే అవకాశం ఉండదు. రేవంత్ రెడ్డి కొత్త ఓటర్ల మనసు చూరగొనాలని ఈ ప్రతిపాదన చేశారేమో.. కానీ… దీని వల్ల ప్రజాస్వామ్యానికి లాభాలుంటాయని ఎవరూ అనుకోలేరు.